Begin typing your search above and press return to search.

అవును బాబుగారు..మీరు ఊహించిన దానికంటే మంచి ఫ‌లితాలే!

By:  Tupaki Desk   |   15 May 2019 5:13 AM GMT
అవును బాబుగారు..మీరు ఊహించిన దానికంటే మంచి ఫ‌లితాలే!
X
కేబినెట్ స‌మావేశం పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌క‌పోతే ఏపీలో పాల‌న మొత్తం ఆగిపోతున్న‌ట్లుగా.. ప్ర‌జ‌ల‌కు ఏదేదో అయిపోతుంద‌న్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చిన పెద్ద మ‌నిషి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసి.. అర్జెంట్ గా స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని లేదంటే కొంప‌లు ఆరిపోతాయ‌న్నంత‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈసీ ఓకే చెప్పిన నేప‌థ్యంలో కేబినెట్ స‌మావేశాన్నినిర్వ‌హించిన చంద్ర‌బాబు.. మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారన్న విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించేందుకు స‌మావేశ‌మ‌వుతున్న‌ట్లు చెప్పినా.. వారి మాటల్లో ఎక్కువ‌గా రాజ‌కీయ‌మే దొర్లింది. సామాన్యులు ఇద్ద‌రు క‌లిస్తేనే రాజ‌కీయం గురించి మాట్లాడుకుంటున్న వేళ‌.. రాజ‌కీయ నేత‌లు న‌లుగురు క‌లిస్తే.. ఆ మాత్రం ముచ్చ‌ట్లు ఉండ‌వా? అనుకోవ‌చ్చు. కానీ.. బాబు బ్యాచ్ మ‌ధ్య సాగిన మాట‌లు చూస్తే.. కాకిలెక్క‌ల‌తో కాలం గ‌డిపేసిన తీరు చూస్తే.. ప్ర‌జ‌లతో బాబు ప‌రివారం లింకు మిస్ అయ్యింద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

పేద వ‌ర్గాలు మ‌న‌తోనే ఉన్నాయి.. విజ‌యం మ‌న‌దే.. ఎలాంటి ఆందోళ‌న అక్క‌ర్లేద‌ని బాబు అంటే.. మంత్రులు సైతం అందుకు తీసిపోన‌ట్లుగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి క‌లుగ‌జేసుకొని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్థిదారులు 1.10ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని.. వీరికి చివ‌రి మూడు నెల‌ల్లోనే రూ.98 కోట్ల మొత్తం అందింద‌ని.. దాని ప్ర‌భావం ప‌క్కాగా ఉంటుంద‌న్నారు.

పింఛ‌నుదారుల్లో టీడీపీ 20 శాతం అధిత్యం ఉంద‌ని.. మ‌హిళ‌ల్లో ఐదారు శాతం ఉంటుంద‌ని.. మ‌రో మంత్రి దేవినేని ఉమ లెక్క‌లు చెప్ప‌గా.. చంద్ర‌బాబు క‌లుగ‌జేసుకుంటూ.. మీరు ఊహించిన దాని కంటే ఫ‌లితాలు బాగుంటాయ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. బాబు కేబినెట్ మీటింగ్ ను ద‌గ్గ‌ర నుంచి పరిశీలించిన నేత ఒక‌రు మాట్లాడుతూ.. ఆత్మ‌విశ్వాసం కంటే అత్యుత్సాహ‌మే ఎక్కువ‌గా క‌నిపించింద‌ని.. వారి లెక్క‌ల‌న్ని సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు.. దాని ల‌బ్థిదారులంతా త‌ప్ప‌నిస‌రిగా ఓట్లు వేస్తార‌న్న అంచ‌నానే త‌ప్పించి.. పోలింగ్ ఎలా జ‌రిగింద‌న్న దానిపై ఎలాంటి సాంకేతిక అంచ‌నా లేక‌పోవ‌టం పెద్ద లోప‌మ‌ని.. బాగుంది.. అంతా బాగుంద‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న త‌మ్ముళ్ల‌కు షాక్ త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. కేబినెట్ పేరుతో కాకిలెక్క‌ల‌తో కాలం గ‌డిపేశార‌న్న వాద‌న ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.