Begin typing your search above and press return to search.

బాబు ప్రెస్ మీట్లో స‌ర్వే ఫ‌లితాలు చెప్ప‌ట‌మా?

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:11 AM GMT
బాబు ప్రెస్ మీట్లో స‌ర్వే ఫ‌లితాలు చెప్ప‌ట‌మా?
X
రెండు తెలుగురాష్ట్రాల్లో ఆస‌క్తిక‌రంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ జ‌ర‌గ‌టానికి కొద్ది గంట‌ల ముందు చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం 21వ తేదీ సాయంత్రం ముగిసింది. ఈ రోజు (ఆగ‌స్టు 23) పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. అంద‌రికి ఆద‌ర్శంగా నిల‌వాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. అందుకు భిన్నంగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించి మ‌రీ.. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి అనువుగా మార్చ‌టంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

పోటాపోటీగా సాగుతున్న ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాను చెప్పాల‌నుకున్న విష‌యాల్ని పోలింగ్ త‌ర్వాత కానీ.. ఉప ఎన్నిక ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత కానీ చెబితే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విలేక‌రుల స‌మావేశం పేరుతో ప్ర‌తిప‌క్ష నేత మీద తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేయ‌టంపై అభ్యంతరాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నంగా ప‌లువురు ఆరోపిస్తున్నారు.

ఇది క‌చ్ఛితంగా కోడ్ ఉల్లంఘ‌నేన‌ని.. ఈ విలేక‌రుల స‌మావేశాన్ని సుమోటోగా తీసుకొని ఎన్నిక‌ల సంఘం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రెస్ మీట్లో విప‌క్ష నేత‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ విమ‌ర్శ‌ల్లో కొత్త‌వి ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్ప‌టికే బాబు ప్ర‌స్తావించిన అంశాలే ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయ‌న తాను ఓ ప్రొఫెష‌న‌ల్ ఏజెన్సీతో నిర్వ‌హించుకున్న స‌ర్వే గురించి చెప్పుకురావ‌టంపై ప‌లువురు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున‌నారు. ఆయ‌న వెల్ల‌డించిన స‌ర్వే ఫ‌లితాలు నంద్యాల ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి ప్రెస్ మీట్ ను ప‌లు టీవీ ఛాన‌ళ్లు లైవ్ టెలికాస్ట్ చేశాయి.

పాల‌న‌.. మ‌ద్యం విధానం.. ఇసుక విధానం.. విశాఖ భూముల వ్య‌వ‌హారం.. రైతుబ‌జార్లు.. టౌన్ ప్లానింగ్ త‌దిత‌ర అనేక అంశాల‌పై నెల క్రితం తాను జ‌రిపించుకున్న‌ట్లు చెబుతున్న స‌ర్వే ఫ‌లితాల్ని మంగ‌ళ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల వేళ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్ప‌టంలో అంత‌ర్యం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ కు కొన్ని గంట‌ల ముందు పెట్టిన ఈ విలేక‌రుల భేటీ పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం బాగా ప‌ని చేస్తుంద‌న్న భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోనూ.. నంద్యాల ఓట‌ర్ల‌లోక‌ల్పించ‌టానికే అన్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఒక‌వేళ‌.. సీఎంకు ఇలాంటి ఉద్దేశం లేద‌నే అనుకుందాం. అయితే.. తాను చేసే ప‌ని మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న కూడా లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. సీఎం స్థాయిలో ఉన్న తాను ఒక రోజు ఆగి ఇవే మాట‌ల్ని మ‌రో రోజు ప్రెస్ మీట్ పెట్టొచ్చు క‌దా? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. ఏది ఏమైనా.. కీల‌క‌మైన ఉప ఎన్నిక పోలింగ్‌ కు కొన్ని గంట‌ల ముందు బాబు పెట్టిన ప్రెస్ మీట్ మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.