Begin typing your search above and press return to search.

పొద్దుపోయాక ప్రెస్ మీట్లో బాబు ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   8 March 2018 4:27 AM GMT
పొద్దుపోయాక ప్రెస్ మీట్లో బాబు ఏం చెప్పారు?
X
ఏపీ ఫ్యూచ‌ర్ ను.. ఆ మాట‌కు వ‌స్తే దేశ భ‌విత‌కు సంబంధించి కీల‌క ప‌రిణామాలు నిన్న (బుధ‌వారం) చోటు చేసుకున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న జ‌రిగిందంతా ఒక్క వాక్యంలో చెప్పేయాలంటే.. హోదా విష‌యంలో కేంద్రం మ‌రోసారి త‌న వైఖ‌రిని కుద‌ర‌ద‌ని క‌ర‌కుగా చెప్పేస్తే.. ఏపీ స‌ర్కారు అందుకు రియాక్ట్ అయి.. కేంద్రంలో ఉన్న త‌మ కేంద్ర‌మంత్రుల చేత రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం.

అయితే.. ఇదంతా జ‌ర‌గ‌టానికి నిన్న చాలానే జ‌రిగింది. ఎన్నో ప‌రిణామాల త‌ర్వాత అంతిమంగా వ‌చ్చిన ఫ‌లితం మోడీ..బాబుల మ‌ధ్య క‌టీఫ్ గా చెప్పాలి. మోడీతో క‌టీఫ్ చెప్పేందుకు పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన బాబు.. త‌మ్ముళ్లంతా మోడీతో ఫైట్ చేసేందుకు ఓకే చెప్పేయ‌టంతో.. త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌టం కోసం బుధ‌వారం రాత్రి బాగా పొద్దుపోయాక బాబు ప్రెస్ మీట్ పెట్టారు.

ప్రెస్ మీట్ పెడితే సుదీర్ఘంగా మాట్లాడే బాబు.. మోడీతో క‌టీఫ్ లాంటి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత పెట్టిన ప్రెస్ మీట్ కావ‌టంతో మ‌రెంత సుదీర్ఘంగా సాగుతుంద‌న్న భ‌యం మీడియా వ‌ర్గాల్లో నెల‌కొంది. ఎందుకంటే.. ప్రింట్ మీడియా డెడ్ లైన్ త‌న్నుకొస్తున్న వేళ‌.. బాబు చెప్పిందంతా రాసుకొని.. దాన్ని తీర్చి దిద్ది ప‌త్రిక‌ల్లో అచ్చేయ‌టం పెద్ద ప్ర‌క్రియ‌. బాబు కార‌ణంగా నిన్న‌టి రోజు ప‌త్రిక‌ల్లో ప‌ని చేసే పాత్రికేయుల‌కు.. ప్రింటింగ్ సిబ్బందికి చుక్క‌లు క‌నిపించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇలాంటి ఈతి బాధ‌ల్ని ప‌క్క‌న పెట్టేస్తే.. మోడీ స‌ర్కారు త‌మ‌కు థోకా ఇచ్చింద‌న్న ఆగ్ర‌హంతో ఉన్న బాబు.. మీడియాతో ఏం మాట్లాడారు? అన్న‌ది కీల‌క‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ఈ ప్రెస్ మీట్ అంతో ఇంతో రిఫెరెన్స్ గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. అందుకే.. బాబు మాట‌ల్ని కాస్త రికార్డు చేసుకోవాల్సిన అవ‌స‌రం తెలుగు ప్ర‌జ‌లంద‌రికి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్రెస్ మీట్లో బాబు చెప్పిన మాట‌ల్లో కీల‌కాంశాల్ని చూస్తే..

+ ఏ ఉద్దేశంతో కేంద్రంలో చేరామో అదే నెర‌వేర‌న‌ప్పుడు అక్క‌డ ఉండ‌టం వృథా అన్న ఉద్దేశంతోనే బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌నుకున్నాం. ప్ర‌స్తుతం తొలి అడుగుగా ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కొచ్చామ‌ని.. ఎన్డీయేలో కొన‌సాగాలా? వ‌ద్దా? అనే దానిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. దీనిపై ఏం చేయాలో త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటాం.

+ ప‌రిప‌క్వ‌త క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌ధాని మోడీకి మా నిర్ణ‌యాన్ని చెప్ప‌టం బాధ్య‌త‌గా భావించి సంప్ర‌దించినా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. మావి గొంతెమ్మ కోర్కెలు కావు. మేం కోరుతున్న అంశాలు అన్యాయ‌మైతే చెప్పండి. న్యాయ‌మైతే చేయండి. ప్ర‌తి అంశాన్నిస‌మీక్షించి.. ద‌గాప‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం చేసే బాధ్య‌త తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరాం. కానీ.. మొండివైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌టం స‌మాఖ్య వ్య‌వ‌స్థ ఎలా అవుతుందో ఆలోచించాలి.

+ దేశ ర‌క్ష‌ణ కోసం వినియోగించే డ‌బ్బులు కూడా ఇవ్వ‌మ‌ని అడిగిన‌ట్లుగా అర్థ‌మొచ్చేలా అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడారు. ఇది చాలా బాధాక‌రం. అవ‌మాన‌క‌రం. స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాల‌నేది ఆలోచించ‌కుండా.. కేంద్ర రాష్ట్ర స‌బంధాలు ప‌ట్టించుకోకుండా కేంద్రం ఏక‌ప‌క్ష నిర్ణయాలు తీసుకుంది. విభ‌జ‌న బిల్లు పార్ల‌మెంటులో పాస్ అయిన‌ప్పుడు ఇప్పుటి ఆర్థిక‌మంత్రి.. ఉప‌రాష్ట్రప‌తి.. ప్ర‌తిప‌క్ష నేత‌లుగా ఉంటూ పోరాడు. దాన్ని అమ‌లు చేసే విష‌యంలో మాత్రం ఎందుకింత నిర్లక్ష్యం? ఎందుకింత ఉదాసీన‌త‌? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సాయం చేసే ఉద్దేశం కేంద్రంలో ఏ మాత్రం క‌నిపించ‌టం లేదు.

+ కేంద్రం తీరు చూస్తే.. వారు ముందే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లుగా ఉంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాపాడాలంటూ ఎన్నిసార్లు అడిగినా స్పందించ‌లేక‌పోవ‌టంతో మ‌రో మార్గం లేక బ‌య‌ట‌కు వ‌చ్చేశాం. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుల్ని క‌లిశాను. మూడుసార్లు వారిని నిల‌దీశాను. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం.. విభ‌జ‌న చ‌ట్టంలోని 19 అంశాల ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి అసెంబ్లీలో సుదీర్ఘంగా వివ‌రించా. ఎక్క‌డా రెచ్చ‌గొట్టేట్లు మాట్లాడ‌లేదు. కేవ‌లం అన్యాయాన్ని మాత్ర‌మే వివ‌రించా. ఇవ‌న్నీ చెప్పాక అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టేసి ప్ర‌త్యేక హోదా ఇవ్వం.. ప్రోత్స‌హాకాలు ఇవ్వ‌మంటూ కించ‌ప‌రిచేలా మాట్లాడారు.

+ ఈఏపీలు, రాయితీల గురించి మాట్లాడకుండా... ‘30 శాతం అదనపు నిధులు’ అంటూ సింపుల్‌గా తేల్చేశారు.ఇదంతా చూస్తే... ఏపీకి సహాయం చేయాలనే ఉద్దేశం వారికి లేదని అనిపించింది. దీనిపై మంత్రులు, ఎంపీలతో చర్చించాను. రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోనందున... కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం. గురువారం అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి ప్రధాన మంత్రిని కలిసి రాజీనామాలు సమర్పిస్తారు.

+ కేంద్రం డ‌బ్బులంతా మ‌న‌మే ఏదో అడుగుతున్న‌ట్లుగా ఆయన వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాదు. ప్ర‌త్యేక హోదా ఎవ‌రికీ ఇవ్వ‌టం లేద‌ని.. అందులో ఉన్న అంశాల‌న్నింటినీ ప్ర‌త్యేక సాయం రూపంలో ఇస్తామ‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల‌కు ఇస్తూ మ‌న‌కు ఇవ్వ‌కుండా వివ‌క్ష చూపిస్తున్నారు. మీకు ప్ర‌త్యేక హోదా ఇస్తే బిహార్ కు ఇవ్వాల్సి వ‌స్తోంద‌ని కేంద్రం పోలిక పెట్ట‌టం స‌రికాదు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించ‌టానికి.. న‌చ్చ‌జెప్ప‌టానికి అన్ని విధాలుగా ప్ర‌య‌త్నించా. రాష్ట్రానికి అన్యాయం జ‌రిగినందునే విధిలేని ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట‌కు వ‌చ్చాం. ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను ఇప్ప‌టికైనా గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నా.

+ మా నిర్ణ‌యంపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న దానిపైనే భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌జ‌లంతా సంఘ‌టితంగా ఉండాలి. మ‌న హ‌క్కులు కాపాడుకోవ‌టంలో క‌లిసి ముందుకుపోదాం. రాష్ట్రంలో విధ్వంసం జ‌రిగితే మ‌న‌మే న‌ష్ట‌పోతాం. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాపాడుకోవ‌టం ముఖ్యం. దీనిపై రాజ‌కీయాలు చేయ‌టానికి సిద్ధంగా లేను.

+ రాహుల్ గాంధీ ఎలా సాయం చేస్తారో చెప్పాలి. ఈఏపీ ఇస్తారా? ప్ర‌త్యేక హోదా ఇస్తారా అనిచెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏం చేయాలో అది చేస్తాం. దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక రాష్ట్రం. మ‌న‌మూ ప‌న్నులు క‌డుతున్నాం. రాష్ట్రం కోస‌మే కేంద్రాన్ని వ్య‌తిరేకించా. నాలుగేళ్లు అన్ని ప్ర‌య‌త్నాలూ చేశా. ఇప్ప‌టికి నిర్ణ‌యం తీసుకోకుంటే రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంద‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేశా.

+ కేంద్ర బ‌డ్జెట్ చూశాక స్పందించి గ‌ట్టిగా మాట్లాడా. దాన్ని అర్థం చేసుకోక‌పోగా.. కేంద్రం వ్య‌తిరేక ధోర‌ణిలో మాట్లాడింది. చివ‌ర‌కు మంత్రుల రాజీనామా వ‌ర‌కు తెచ్చారు. దేశంలో ఏపీ కూడా ఒక రాష్ట్రం. మ‌నం ప‌న్నులు క‌డుతున్నాం. మ‌న‌కూ అడిగే హ‌క్కు ఉంది. న్యాయం చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంది.

+ వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృధ్ధి కింద ఏడు జిల్లాల‌కు ఈ ఫిబ్ర‌వ‌రి 9న రూ.350 కోట్లు ఇచ్చారు. త‌ర్వాత ప్ర‌ధాని ఆమోదం లేద‌ని చెప్పి ఖాతా నుంచి ఆ డ‌బ్బులు వెన‌క్కి తీసుకున్నారు. దీన్ని ఎలా భావించాలి. కేంద్రం సాయం చేస్తుంద‌నుకోవాలా? లేదా? అన్న‌ది ప్ర‌జ‌లే చెప్పాలి. రాజ‌ధాని కోసం కేంద్రం ఇచ్చిన నిధులు.. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చాం. వారికేం కావాలి. తొలి ఆర్థిక సంవ‌త్స‌రం ఆర్థిక‌లోటు రూ.16,078 కోట్లు ఉంద‌ని కాగ్ తేల్చింది. రైతు రుణ‌మాఫీ.. సామాజిక భ‌ద్ర‌త పింఛ‌న్లు.. డిస్క‌మ్ ల‌కు చెల్లించిన సొమ్మును మిన‌హాయిస్తే రెవెన్యూ లోటు రూ.4117 కోట్లే వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే రూ.3979 కోట్లు ఇచ్చినందు వ‌ల్ల ఇక రూ.138 కోట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అన్ని త‌ప్పుడు లెక్క‌లు వేశారు. కాగ్ చెప్పింది కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా సొంత లెక్క‌లు వేశారు.

+ రెవెన్యూ లోటును ఎక్కువ చేసి చూపించామన్న కేంద్రం వాదన కూడా తప్పు. పీఆర్సీ కింద ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4వేల కోట్లు ప్రావిడెంట్‌ ఫండ్‌కు జమ చేశాం. విభజన ఫలితంగా 3 వేల కోట్లు పెండింగ్‌ బిల్లులు రాష్ట్రం ఖాతాకు వచ్చి పడ్డాయి. ఇక... పింఛన్లకు సంబంధించి కూడా 1900 కోట్లు చెల్లింపులు చేయాల్సి వచ్చింది. కేంద్రం లెక్కల ప్రకారమే విభజన జరిగిన తర్వాతి సంవత్సరం ఏపీ రెవెన్యూలోటు 6600 కోట్లుగా నిర్ధారణ అయ్యింది. విభజన జరిగిన ఏడాది లోటు ఇంకా ఎక్కువ ఉంటుంది. అయినా అంత లేదని లెక్కలుకట్టి చూపిస్తున్నారు. ఏపీకి వచ్చే ఆదాయంపై 14వ ఆర్థిక సంఘం కొన్ని లెక్కలు కట్టింది. వాళ్ల లెక్కలకు, వాస్తవ ఆదాయానికి 23వేల కోట్ల తేడా ఉంది. విభజన వల్లే ఇంత అగాథం ఏర్పడింది.

+ గ‌డిచిన నాలుగేళ్ల‌లో మొత్తం రూ.23వేల కోట్ల లోటు ఉంటే ఇప్ప‌టివ‌ర‌కూ రూ.4వేల కోట్లు ఇవ్వ‌లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు కింద రూ.7918 కోట్లు ఖ‌ర్చు చేశాం. కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కూ రూ.5349 కోట్లు ఇచ్చింది. మ‌రో.. రూ.2565 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిధులు అడిగితే ప‌నుల పురోగ‌తి ఉండాలి క‌దా? అంటూ మాట్లాడుతున్నారు.

+ ప్రత్యేక హోదా విషయంలో గతంలో రాజీ పడ్డానన్న అభిప్రాయం సరికాదు. దేశంలో ఎవరికీ ఇవ్వడంలేదన్నప్పుడు మాత్రమే సర్దుకుపోయి, ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు పొడిగిస్తున్నారని తెలిసి.. గట్టిగా హోదా కోసం పట్టుపట్టాం.