Begin typing your search above and press return to search.

డాక్టర్లను నడిరోడ్డు మీద కొడతారా- బాబు నిలదీత

By:  Tupaki Desk   |   7 Aug 2019 2:24 PM GMT
డాక్టర్లను నడిరోడ్డు మీద కొడతారా- బాబు నిలదీత
X
ఏపీ ప్రభుత్వం నిరసనలను దారుణంగా అణచివేస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కొద్దిరోజులుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను రద్దు చేస్తూ దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటుచేస్తూ పార్లమెంటు బిల్లు పాస్ చేసింది. దీనిపై డాక్టర్లు దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు.

అందులో భాగంగా రాష్ట్రంలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుపతిలో డాక్టర్లు అలిపిరి వద్ద ఆందోళనలు చేస్తూ భక్తులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి డాక్టరును కొట్టారు. ఆ వీడియోను తన ట్విట్టరులో చంద్రబాబు పోస్టు చేస్తూ ... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ప్రభుత్వం నిరసనకారులను శాంతింపచేయాలి గాని అణచివేయడం కరెక్టు కాదని విమర్శించారు. ‘‘సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. ఎన్ ఎమ్ సీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేనా రాజన్నరాజ్యం? ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.’’ ఇది చంద్రబాబు చేసిన ట్వీట్.

నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని... అసహనంతో అణచివేయడం కరెక్టు కాదు అన్నట్టు చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఏ ప్రభుత్వంలో అయినా ఆందోళనకారుల నిరసన వాటిపై పోలీసుల జులుం సర్వసాధారణమైపోయింది. ఇదొక తాజా ఉదాహరణ అంతే.