Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు బాబు ఇచ్చిన ర్యాంకులివే!

By:  Tupaki Desk   |   7 March 2018 4:57 AM GMT
త‌మ్ముళ్ల‌కు బాబు ఇచ్చిన ర్యాంకులివే!
X
కార్పొరేట్ ఆఫీసో.. రాజ‌కీయ పార్టీనో అర్థం కాన‌ట్లుగా మారింది ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి. ఇటీవ‌ల కాలంలో మార్కులు..ర్యాంకుల మీద ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నారు చంద్ర‌బాబు. వాటిని మ‌దింపు చేసే విష‌యంలో ఎలాంటి ప్ర‌మాణాల్ని పాటిస్తున్నారో తెలీదు కానీ.. బాబు త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్న‌ర్యాంకుల మాద ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌కుఅత్యంత స‌న్నిహితుడు.. రాష్ట్ర మంత్రి నారాయ‌ణ మాష్టారి పుణ్య‌మా అని.. బాబుకు ర్యాంకుల ఆస‌క్తి పెరిగిన‌ట్లుగా కొంద‌రు జోక్ చేస్తుంటారు.

ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్యేల ప‌ని తీరుపై స‌ర్వేలు నిర్వ‌హించి.. వారికి ర్యాంకులు ఇవ్వ‌టం తెలిసిందే. మంత్రుల పని తీరు మీద ర్యాంకుల లెక్క‌లు క‌ట్టేశారు. త‌ర‌చూ స‌ర్వేలు జ‌రిపిస్తూ.. మంత్రుల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారే కానీ.. వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న భావ‌న త‌మ్ముళ్ల‌లో నెల‌కొంద‌ని చెబుతారు. అయితే.. వీటిని ప‌ట్టించుకోని బాబు త‌న దారిన తాను న‌డుస్తున్నారని చెబుతారు.

తాజాగా పార్టీ ఎమ్మెల్యేల‌కు.. ఎమ్మెల్సీల‌కు ర్యాంకులు ఇవ్వ‌ట‌మే కాదు.. వివిధ విభాగాల్లో అత్యుత్త‌మ ప‌ని తీరు ప్ర‌ద‌ర్శించారంటూ మెరుగైన ర్యాంకుల్ని అందించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ఈ ర్యాంకు ప్ర‌స్తావ‌న తెచ్చిన ఆయ‌న‌.. ప‌లు విభాగాల్లో అత్యుత్తమ ప‌నితీరు ప్ర‌ద‌ర్శించిన నాయ‌కుల పేర్ల‌ను స్వ‌యంగా చ‌దివి వినిపించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురిని అభినందించ‌టం క‌నిపించింది.

ఇక‌.. బాబు ప్ర‌క‌టించిన కొన్ని విభాగాల‌ను చూస్తే.. ఉత్త‌మ రాజ‌కీయ వ్యాఖ్య కేట‌గిరిలో మంత్రి అచ్చ‌న్నాయుడు నిలిచారు. మీడియా పాయింట్ ద‌గ్గ‌ర బాగా మాట్లాడేవారిలో మొద‌టిస్థానం ఎమ్మెల్యే గ‌ణేష్ కుమార్ నిల‌వ‌గా.. రెండో స్థానంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న నిలిచారు. ఇక‌.. జీవీ అంజ‌నేయులు మూడో స్థానంలో నిలిచారు.

ఇక‌.. ఉత్త‌మ ప్ర‌జంటేష‌న్ విభాగంలో మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ఉత్త‌మ అనుబంధ ప్ర‌శ్న విభాగంలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ శ‌ర్మ‌ ఎంపికైన‌ట్లుగా బాబు ప్ర‌క‌టించారు. మొత్తానికి విభాగాల వారీగా పార్టీ నేత‌ల‌కు ర్యాంకులు ఇస్తున్న బాబు ఇవ‌న్నీ ఏ లెక్క‌న చేప‌డుతున్నారో వివ‌రిస్తే బాగుంటుందేమో. అన్ని బాగున్నాయి కానీ.. ఏపీ మంత్రిగా బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన చిన‌బాబు లోకేశ్ ప‌ని తీరు మాటేంటి? ఆయ‌న‌కు బాబు ఇస్తున్న ర్యాంకు ముచ్చ‌ట కూడా బ‌య‌ట‌పెడితే బాగుంటుంది క‌దా?