Begin typing your search above and press return to search.

గులాబీ వనంలో 'పసుపు' దళం

By:  Tupaki Desk   |   27 Dec 2015 6:19 AM GMT
గులాబీ వనంలో పసుపు దళం
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎర్రవల్లిలోని యాగశాలకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

చంద్రబాబు కాన్వాయ్ ఎర్రవల్లిలో చండీయాగం వేదిక వద్దకు నేరుగా చేరుకుంది. అక్కడ ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికారు. యాగ సంప్రదాయం ప్రకారం పసుపురంగు వస్త్రం కప్పారు. కేసీఆర్ చంద్రబాబుకు ఎదురొచ్చి ఆలింగనం చేసుకుని స్వయంగా యాగం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శనం చేయించి విశిష్ఠ అతిథుల వేదికపై చంద్రబాబును సత్కరించారు. యాగం జరుగుతున్న తీరును కేసీఆర్ చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబుతో పాటుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - కేంద్ర మంత్రి సుజనా చౌదరి - ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు వెళ్లారు.

కాగా యాగం చివరి రోజైన ఆదివారం పూర్ణాహుతి సందర్భంగా మరింత అత్యద్భుతంగా సాగనుంది. రోజుకో రంగులో వస్త్రాలు ధరిస్తున్న యాగంలో ఆదివారం పూర్తి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ రోజే రావడంతో ఆయనకు పసుపు రంగు వస్త్రం కప్పి యాగస్థలికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ సరదా చర్చలు సాగాయి. తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబుకు పసుపు రంగు వస్త్రం కప్పడం కాకతాళీయమే అయినా ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ పార్టీ రంగు పసుపు కావడం, అనుకోకుండా ఈ రోజు యాగంలో అదే రంగు వస్త్రాలు ధరించడంతో చంద్రబాబు ముఖంలోనూ ఆనందం కనిపించింది. అదే ఏ గులాబీ రంగో అయితే చంద్రబాబు కప్పుకొనేవారా? కాదా? అని కొందరు అక్కడ ముచ్చటించుకోవడం కనిపించింది. ఆదివారం పసుపు రంగునుఎంచుకోవడం కాకతాళీయమా లేదంటే చంద్రబాబు కోసమా అన్న సందేహం కూడా చాలామందిలో ఉంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ చేస్తున్న యాగంలో చంద్రబాబు, ఆయన బృందం పాల్గొనడం.. లక్షలాది మంది పసుపు దుస్తుల్లో ఉండడంతో గులాబీ వనంలో పసుపు దళం కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. మొత్తానికి యాగం సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడంతో రాజకీయంగా శుభపరిణామమని... ఇక తెలుగు రాష్ట్రాలకు శుభం జరుగుతుందని పండితులు అంటున్నారు.