Begin typing your search above and press return to search.

వంశీ రాజీనామా లేఖకు తిరిగి లేఖ రాసిన బాబు!

By:  Tupaki Desk   |   28 Oct 2019 5:05 AM GMT
వంశీ రాజీనామా లేఖకు తిరిగి లేఖ రాసిన బాబు!
X
అందుకే అంటారు రాజకీయాల్ని ఎవరు ఎలా చూస్తారో.. వారికి అలానే కనిపిస్తుందని. టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని ఏపీ రాజకీయాలు ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. తెలుగు నేల మీద రాజకీయాలకు సంబంధించి ప్రతి విషయంలోనూ అనారోగ్య విధానాల్ని ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబు సొంతమని చెప్పాలి.

రాజకీయాలు ఖరీదెక్కటానికి.. ఎన్నికల్లో ఇంత భారీ ధనాన్ని వెచ్చింటంతో పాటు.. కులాల ఆధారంగా.. వర్గాల ప్రాతిపదికన చీల్చేసి.. ప్రయోజనం పొందాలన్న దుర్మార్గ ప్లాన్ తో పాటు.. మరిన్ని వికారాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పార్టీ పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. అధినేతకు లేఖ రాయటం తెలిసిందే.

ఈ లేఖకు వెంటనే బదులిచ్చారు చంద్రబాబు. వంశీ ప్రస్తావించిన అంశాల మీద తన అభిప్రాయాల్ని ఆయన చెప్పుకొచ్చారు. తనకు లేఖ అందిందని.. అందులోని కంటెంట్ ను కూడా తాను చదివినట్లుగా పేర్కొన్నారు. ప్రత్యర్థి రాజకీయ నేతలు.. కొందరు అధికారుల కారణంగా పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరాన్ని చెప్పిన ఆయన.. రాజీనామా చేయటం సరికాదన్నారు. ‘‘మీపై పెట్టిన కేసు దురుద్దేశంతో కూడినవి. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రతీకార రాజకీయ చర్యలను ఆపదు. రాజకీయాలకు రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదు. ప్రజలలో అవగాహన కలిగించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటమే బాధ్యత’’ అని పేర్కొన్నారు.

వంశీ పోరాటం చేసే పక్షంలో తాను వ్యక్తిగతంగానూ.. పార్టీ పరంగానూ అండగా నిలుస్తానన్న భరోసా ఇచ్చారు. తమ పార్టీ నేతల్ని అధికారపార్టీ వివిధ రకాలుగా వేధిస్తోందన్న చంద్రబాబు.. అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటామని బాబు తన లేఖలో ప్రస్తావించారు. మరి.. దీనికి వంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.