Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ దెబ్బ‌కు... ఎన్నిక‌ల క‌సర‌త్తులో బాబు!

By:  Tupaki Desk   |   18 July 2017 9:58 AM GMT
జ‌గ‌న్ దెబ్బ‌కు... ఎన్నిక‌ల క‌సర‌త్తులో బాబు!
X
గ‌డ‌చిన ఎన్నిక‌లు ముగిసి ఇప్ప‌టికి మూడేళ్లు పూర్తి అయిపోయింది. 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర కంటే అధిక స‌మ‌య‌ముంది. అయితే న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి వేదికగా ఇటీవలే నిర్వ‌హించిన ప్లీన‌రీ స‌మావేశంలో వైసీపీ అధినేత‌ - విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాదాపుగా ఎన్నిక‌ల స‌మ‌ర శంఖాన్ని పూరించేశారు. అయితే ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర కంటే అధికంగానే స‌మ‌య‌ముండ‌గా.. ఇప్పుడే ఎన్నిక‌ల హామీలు ఇవ్వ‌డ‌మేమిట‌ని కూడా నాడు టీడీపీ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా ముందే కూసిన కోయిల అంటూ వైసీపీ ప్లీన‌రీని టీడీపీ నేత‌లు ఎద్దేవా కూడా చేశారు. అయితే విప‌క్ష పార్టీగా ఉన్న పార్టీలు ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా ఎన్నిక‌ల క‌స‌ర‌త్తును మొద‌లుపెట్ట‌డం కొత్తేమీ కాద‌ని, గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే పాద‌యాత్ర చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు.. వైసీపీ ఎన్నిక‌ల స‌మ‌ర శంఖాన్ని పెద్ద‌గా త‌ప్పు ప‌ట్ట‌లేదు.

అయితే ప్లీన‌రీ సంద‌ర్భంగా జ‌గ‌న్ విడుద‌ల చేసిన పార్టీ మేనిఫెస్టో లాంటి తొమ్మిది హామీలు టీడీపీలోనే కాకుండా... ఆ పార్టీ అధినేత‌గా, సీఎంగా ఉన్న చంద్ర‌బాబులో బాగానే గుబులు రేపిన‌ట్లున్నాయి. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో చంద్రబాబు కూడా ఏకంగా ఎన్నిక‌ల స‌మ‌ర శంఖాన్ని పూరించేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. కేబినెట్ స‌మావేశం జ‌రిగిన రోజే... అటు మంత్రుల‌తో పాటు పార్టీ ముఖ్యుల‌తో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న చంద్ర‌బాబు... నేటి స‌మావేశంలో కాస్తంత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల సంవ‌త్సరంగానే భావించాల్సి ఉంద‌ని, నేత‌లంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మంత్రుల నుంచి గ్రామ స్థాయి నేత‌ల దాకా పార్టీ నేత‌లంతా కూడా ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల్సిందేన‌ని కూడా చంద్ర‌బాబు అన్నారు.

అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్లు ఆశించే వారి ప‌నితీరును ప‌రిశీలించిన మీద‌టే వారి అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేస్తామ‌ని చెప్పారు. టికెట్ల కోసం త‌న చుట్టు తిర‌గ‌డాన్ని మానేసి... ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లి త‌మ‌ను తాము నిరూపించుకోవాలని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలించిన ఎవ‌రికైనా... ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌ర శంఖాన్ని పూరించిన‌ట్లుగానే భావించాల్సి వ‌స్తుంద‌న్న మాట చెబుతున్నారు. జ‌గ‌న్ హామీల‌ను ముందే కూసిన కోయిల‌గా అభివ‌ర్ణించిన టీడీపీ నేత‌లు... జ‌గ‌న్ దీటుగానే ముందుకు వెళుతున్నట్లుగా తాజాగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏమంటార‌ని కూడా ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.