Begin typing your search above and press return to search.

వెల్ కంకు బాబు ఓకే చెప్పేయ‌నున్నారా?

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:36 AM GMT
వెల్ కంకు బాబు ఓకే చెప్పేయ‌నున్నారా?
X
ఎన్నిక‌లకు ఇంకా ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధి ఉంది. కానీ.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల వేడి అప్పుడే రాజుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. వివిధ పార్టీల్లో చోటు చేసుకుంటున్న తాజా ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. వాస్త‌వానికి ఎన్నిక‌లకు ఏడాది ముందు నుంచే రాజ‌కీయ పార్టీల్లో హ‌డావుడి పెర‌గ‌టంతో పాటు.. అసంతృప్తుల జంపింగ్ లు క‌నిపిస్తాయి.

దూకుడు రాజ‌కీయాల పుణ్య‌మా అని.. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే ఈ త‌ర‌హా సీన్ ఇప్పుడు ఆవిష్కృత‌మ‌వుతోంది. టీటీడీపీ ఫైర్ బ్రాండ్ గా సుప‌రిచితుడైన రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవ‌టం.. ఆయ‌న బాట‌లో ప‌లువురు నేత‌లు ప‌య‌నం కావ‌టం.. అదే స‌మ‌యంలో తెలంగాణ అధికార‌ప‌క్షంలోనూ కొంద‌రు అసంతృప్తులు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధం కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

టీడీపీ నుంచి రేవంత్ ఎగ్జిట్ కావ‌టానికి కార‌ణం చూస్తే.. 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉందంటూ టీడీపీ సీనియ‌ర్ నేత వ్యాఖ్య చేయ‌ట‌మే. దీన్ని విభేదించ‌టంతో పాటు.. వ్య‌తిరేకించిన రేవంత్ కాంగ్రెస్‌ లోకి వెళ్లే వ‌ర‌కూ విష‌యం సాగింది. ఇదిలా ఉంటే.. వెల్ కం పేరుతో స‌రికొత్త సామాజిక ఫార్మూలాను తెర మీద‌కు తీసుకొచ్చారు.

క‌మ్మ‌లు.. వెల‌మ‌లకు పెద్ద‌పీట వేయ‌టం ద్వారా.. ఆరెండు వ‌ర్గాలకు చెందిన వారిని సంతృప్తిప‌ర్చ‌టం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల‌న్న‌ది టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో త‌న అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతున్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోవ‌టం ద్వారా తెలంగాణ‌లో త‌న లెగ‌సీని కంటిన్యూ చేయాల‌ని టీడీపీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

దీనిపై అటు టీడీపీ అధినాయ‌క‌త్వం కానీ.. టీఆర్ ఎస్ అధినేత కానీ ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేదు. నిజానికి ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు సాధ్య‌మేనా? అంటే.. 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని గుర్తు చేస్తుంటారు. అప్పుడున్న ప‌రిస్థితులు.. ఇప్పుడున్న ప‌రిస్థితులు వేర్వేరు అయినా.. తెలంగాణ‌లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ తో క‌ల‌వ‌టం త‌ప్పేం కాద‌న్న మాట‌ను తెలుగు త‌మ్ముళ్లు కొంద‌రు వ్యాఖ్యానించ‌టం విశేషం.

దీన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న రేవంత్ కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అనుకూల‌.. వ్య‌తిరేక రాజ‌కీయ వ‌ర్గాలు ఒక‌టై ఎన్నిక‌ల‌కు వెళ‌తాయ‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. కాంగ్రెస్ తో టీడీపీ జ‌ట్టు క‌ట్టే అవ‌కాశం ఉందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కాంగ్రెస్ ను వ్య‌తిరేకిస్తూ పెట్టిన పార్టీ కాస్తా.. రేపొద్దున కాంగ్రెస్ తో జ‌త క‌ట్టాన్ని ప్ర‌జ‌లు కూడా హ‌ర్షించ‌ర‌న్న మాట వినిపిస్తోంది.

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌ద్ద‌ర్‌.. వామ‌ప‌క్ష వాదులంతా క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. గెలుపు విష‌యంలో ఈ కూట‌మి ప్ర‌భావాన్ని ఎంత‌మేర‌కు చూపిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్నే. రాబోయే ఎన్నికల్లో పొత్తుపై ఇప్పుడే వ్యాఖ్యానించ‌టం తొంద‌ర‌పాటే అవుతుంది. అయితే.. ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే ఇక్క‌డి ల‌క్ష్యం. టీఆర్ ఎస్‌.. కాంగ్రెస్ తో పొత్తుల గురించి మాట్లాడుతున్న వారు బీజేపీ సంగ‌తి ఏం చేస్తార‌న్న ప్ర‌శ్న లేక‌పోలేదు. క‌మ‌ల‌నాథుల‌తో క‌లిసి ప‌ని చేయాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నా.. క‌మ‌ల‌నాథులు లేర‌న్న మాట వినిపిస్తుంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌లకు ఏడాదిన్న‌ర కంటే ఎక్కువ టైం ఉండ‌టం.. ఆ స‌మ‌యానికి చోటు చేసుకునే ప‌రిణామ‌ల‌కు త‌గ్గ‌ట్లుగా అధినేత‌లు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. ఈకార‌ణంతోనే నిన్న టీటీడీపీ నేత‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన చంద్ర‌బాబు.. త‌న వ్యూహం త‌న‌కు ఉంద‌ని.. తాను ఇప్పుడే చెప్ప‌న‌ని.. ఏదైనా ప‌క్కా ప్లాన్ ఉంద‌న్న‌ది నిజ‌మ‌న్న మాట‌ను బాబు చెప్ప‌టం చూస్తే.. 2019 ఎన్నిక‌ల్లో అత్యంత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.