Begin typing your search above and press return to search.

వ‌చ్చే నాలుగు సీట్లు రావ‌టం ఇష్టం లేదా బాబు?

By:  Tupaki Desk   |   23 Oct 2018 4:30 AM GMT
వ‌చ్చే నాలుగు సీట్లు రావ‌టం ఇష్టం లేదా బాబు?
X
హాయిగా సాగే ప్ర‌యాణం అస్స‌లు ఇష్టం ఉండ‌దా? అన్న అనుమానం వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తుంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. తెలంగాణ‌లో కేసీఆర్‌కు తిరుగులేద‌న్న మాట స్థానే.. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కేసీఆర్ గెలుపు అంత ఈజీ కాద‌న్న మాట‌ను చ‌చ్చి చెడి తీసుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. మ‌రి.. ఇలాంటి వేళ‌లో కాంగ్రెస్‌ తో చెట్టాప‌ట్టాలు వేస్తున్న చంద్ర‌బాబు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ.. అదేమీ లేకుండా.. ప‌రిస్థితి కాస్త త‌న‌కు అనుకూలంగా ఉంద‌న‌గానే.. ఆయ‌న‌లోని మ‌రో మ‌నిషి నిద్ర లేచారు.

తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ నేత‌ల‌కు నోటికి ప‌ని చెప్పేలా.. టీఆర్ ఎస్ అధినేత‌కు బంద‌ర్ ల‌డ్డూలా మారేలా ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. హైద‌రాబాద్‌ లో తెలంగాణ పార్టీ నేత‌ల‌తో కాసింత హ‌డావుడి చేశారు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల వేళ త‌న‌కు ద‌క్కిన మ‌ర్యాద‌ల్ని చూసుకొని ఉక్కిరిబిక్కిరి అయిన ఆయ‌న.. ఏ మాట అయితే చెప్ప‌కూడ‌దో ఆ మాట‌ను చెప్పేశారు.

తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. నామినేష‌న్ల‌కు ముందే సీట్లు.. పొత్తులు.. అభ్య‌ర్థుల ఖ‌రారు ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. అవ‌స‌ర‌మైన చోట త్యాగాల‌కు సిద్ధంగా ఉండాల‌ని పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఆయ‌న సూచ‌న చేశారు. సీట్ల స‌ర్దుబాటుకు సంబందించి ప్ర‌తిష్ఠ‌కు పోవ‌ద్ద‌ని.. గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని చెప్పారు.

ఈ మాట‌ల‌న్నీ ఓకే కానీ.. తెలంగాణ‌లో తాను ప్ర‌చారం చేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌టం భారీ త‌ప్పిదంగా చెప్ప‌క త‌ప్ప‌దు. బాబు కానీ ప్ర‌చారం షురూ చేస్తే.. ఆ వెంట‌నే హైద‌రాబాద్ ముచ్చ‌ట‌ను తెర మీద‌కు తెస్తారు. హైద‌రాబాద్ ఘ‌న కీర్తిలో త‌న పాత్ర‌ను త‌న‌కు తాను గొప్ప‌గా కీర్తించుకోవ‌టం.. వాటిని ల‌క్ష్యంగా చేసుకొని కేసీఆర్ విరుచుకుప‌డ‌టం.. తెలంగాణ సెంటిమెంట్‌ ను త‌ట్టి లేప‌టంతో పాటు.. బాబు ఆంధ్రా బూచిని చూపించి ప్ర‌జ‌ల్లోని భావోద్వేగాల్ని త‌ట్టి లేప‌టం లాంటివి ఖాయంగా జ‌రుగుతాయి.

వాస్త‌వానికి తెలంగాణ‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తే ఎంత‌? చేయ‌కుంటే ఎంత‌? ఆయ‌న ప్ర‌చారం చేసినంత‌నే ఓట్లు ఈవీఎంల‌లో న‌మోద‌వుతాయ‌ని భావిస్తే త‌ప్పులో కాలేసిన‌ట్లే. క‌ఠిన‌మైన వాస్త‌వం ఏమంటే.. తెలంగాణ‌లోని ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారే కానీ చంద్ర‌బాబును కాదు. ఈ విష‌యం అర్థం కాక అన‌వ‌స‌ర‌మైన ప్రేలాప‌న‌లు పేలుతున్నారు బాబు.ఆయ‌న ప్ర‌చారానికి వ‌స్తానంటే తెలుగు త‌మ్ముళ్లు చంక‌లు గుద్దుకుంటుంటే.. తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌లు త‌ల ప‌ట్టుకుంటున్నారు. బాబు ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడున్న సానుకూల ప‌రిస్థితికి భిన్నంగా ప్ర‌తికూల ప‌రిస్థితి ఖాయ‌మంటున్నారు. మ‌రింత క్లారిటీగా చెప్పాలంటే.. బాబు కానీ తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తే.. తెలుగుదేశం పార్టీ గెలిచే నాలుగైదు సీట్లు కాస్తా.. బంగారు ప‌ళ్లెంలో పెట్టి కేసీఆర్ చేతికి అందించ‌ట‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రీ.. విష‌యాన్ని బాబు ఎప్ప‌టికి గుర్తిస్తారో చూడాలి.