Begin typing your search above and press return to search.

జాబులు రెడీ... బాబు సంతకమే తరువాయి

By:  Tupaki Desk   |   12 Jun 2016 7:43 AM GMT
జాబులు రెడీ... బాబు సంతకమే తరువాయి
X
ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి రెండేళ్లవుతున్నా ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్న అపప్రదను తొలగించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఏకంగా 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మొత్తం 10 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, అందులో 6 వేల వరకూ పోలీసు - జైళ్ల శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా నాలుగు వేల ఖాళీలకు సంబంధించి మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన దస్త్రం సీఎం వద్దకు చేరింది.. ఆయన సంతకం పెట్టడమే తరువాయి. ఆయన సంతకం పెడితే జీవో విడుదలై ఆ వెంటనే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది.

ప్రభుత్వం చేపట్టనున్న రిక్రూట్ మెంట్లో గ్రూప్ వన్ పరిధిలో డిప్యూటీ కలెక్టర్లు 5 - డీఎస్పీలు 24 - వాణిజ్య పన్నుల అధికారులు 13 - మునిసిపల్‌ కమిషనర్లు 13 - ఎక్సైజ్‌ - ప్రొహిబిషన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు 10 - జిల్లా సైనిక సంక్షేమాధికారులు 2 - జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు 4 - జిల్లా రిజిస్ట్రార్లు 8 - కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్లు 10 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటితో పాటు గ్రూప్‌ - 2 - గ్రూప్ - 3 పరిధిలోని పలు ఖాళీగా ఉన్న పోస్టులనూ ఏపీ సర్కారు భర్తీ చేయనుంది. వీటితో పాటు పోలీసు - జైళ్ల శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగ యువతకు పండగే మరి.

మరోవైపు విపక్ష వైసీపీ ఇప్పటికే చంద్రబాబుపై విమర్శల జోరు పెంచుతోంది. బాబు వస్తే జాబ్ ఇస్తారని చెప్పారని.. కానీ, ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయంటూ జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై కొంత ఒత్తిడి ఉంది. దాంతోపాటు ఉద్యోగ కల్పన బాధ్యతా ఉంది. దాంతో చంద్రబాబు ఖాళీల భర్తీకి క్లియరెన్సు ఇచ్చారని.. ఆయన సూచనతో కసరత్తు పూర్తిచేశారని తెలుస్తోంది. చంద్రబాబు సంతకం చేస్తే కొద్దిరోజుల్లోనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రానుంది.