Begin typing your search above and press return to search.

ఆహ్వానించిన వెంకయ్య, తిరస్కరించిన బాబు

By:  Tupaki Desk   |   7 Sept 2016 9:55 AM IST
ఆహ్వానించిన వెంకయ్య, తిరస్కరించిన బాబు
X
ఇవాళ సాయంత్రానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంత గొప్ప వరాలను ప్రకటిస్తుందో మనకు తెలియదు గానీ.. దానికి సంబంధించి తిరుగులేనిది అన్నట్లుగా ప్రచారం జరిగిపోతోంది. కేంద్రం ఏం ఇవ్వబోతున్నది అనే విషయమైన ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ - వెంకయ్యనాయుడు కలిసి ప్రకటన చేస్తారని, ఈ సమయానికి సుజనాచౌదరి కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి.

అయితే కేంద్రం ఏపీకి చాలా చేసేస్తున్నట్లుగా బిల్డప్‌ ఇవ్వడానికి ఈ ప్యాకేజీ ప్రకటన కార్యక్రమాన్ని ఇంకాస్త రిచ్‌ గా నిర్వహించాలని వెంకయ్యనాయుడు అనుకున్నారుట. కొన్ని రోజుల కిందట వెంకయ్యనాయుడు చెప్పినట్లుగా ఒక పత్రికలో కథనం వచ్చింది. అరుణ్‌ జైట్లీ - చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి ఈ ప్రకటన చేస్తారని ఆ వార్తలో పేర్కొన్నారు. అరుణ్‌ జైట్లీ విజయవాడ రావడం గానీ, చంద్రబాబు ఢిల్లీ రావడం గానీ జరుగుతుందని ఇద్దరూ కలిసే ప్రకటన చేస్తారని వెంకయ్యనాయుడు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అయితే నిజానికి వెంకయ్య కోరుకున్నది అదే. అరుణ్‌ జైట్లీ ఒక పట్టాన మెట్టు దిగి వచ్చే వ్యక్తి కాదు గనుక.. ఆయన ప్యాకేజీ ప్రకటన సమయానికి ఢిల్లీ రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఒకవైపు ప్రత్యేకహోదా కోసం పోరాటం ఆపేది లేదని జనం ముందు ప్రకటనలు ఇస్తూ... ప్యాకేజీ ఇచ్చే సమయానికి మురిసిపోతూ అక్కడకు వస్తే గనుక.. జనం ఛీకొడతారనే భయంతో చంద్రబాబు దానికి తిరస్కరించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ రకంగా పాపం.. జైట్లీ - చంద్రబాబు ఇద్దరి సమక్షంలో ప్యాకేజీని ప్రకటింపజేసి.. అది చాలా ఘనమైన ప్యాకేజీ అన్నట్లుగా దానికి ఓ బిల్డప్‌ ఇవ్వాలని అనుకున్న వెంకయ్యనాయుడు కల నెరవేరకుండానే పోతున్నదని జనం అనుకుంటున్నారు.