Begin typing your search above and press return to search.

శిల్పాపై బాబు క‌క్ష తీర్చుకుంటున్నారే

By:  Tupaki Desk   |   18 Nov 2017 1:18 PM GMT
శిల్పాపై బాబు క‌క్ష తీర్చుకుంటున్నారే
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు `క‌క్ష‌` పూరిత రాజ‌కీయాల‌కు తెర‌దీశారా? త‌న‌దైన శైలిలో అధికారాన్ని వినియోగించి విప‌క్ష నేత‌ల‌ను వేధించ‌డం ప్రారంభించారా? త‌న పార్టీ నుంచి జ‌గ‌న్ చెంత‌కు చేరిన వారిపై `క‌సి` తీర్చుకుంటున్నారా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే గ‌ట్టి స‌మాధానం ఇస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. శిల్పా మోహ‌న్ రెడ్డి.. క‌ర్నూలుకు చెందిన సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నేత‌. అంతేకాదు, టీడీపీలో చంద్ర‌బాబుకు న‌మ్మిన బంటుగా ప‌నిచేసిన వ్య‌క్తి. అయితే, బాబు మాట త‌ప్ప‌డంతో ఆయ‌న తృణ ప్రాయంగా పార్టీని విడిచి పెట్టి జ‌గ‌న్ పార్టీలో చేరారు. ఈ ప‌రిణామాన్ని బాబు జీర్ణించుకోలేక పోయారు. ఫ‌లితంగా ఇప్పుడు క‌క్ష తీర్చుకుంటున్నారు.

ఈ ఏడాది ఆగ‌స్టులో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. 2014లో ఈ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున‌ గెలుపొందిన భూమా నాగిరెడ్డి త‌ర్వాత ప‌ద‌వి కోసం బాబు చెంత‌కు చేరిపోయారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు. దీంతో ఈ సీటుకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు జిల్లా టీడీపీ ఇంచార్జ్‌ గా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి ఈ సీటును త‌న‌కు ఇవ్వాల‌ని బాబును కోరారు. ముందు ఇస్తాన‌ని చెప్పిన బాబు.. ఆ త‌ర్వాత ప్లేట్ ఫిరాయించారు. భూమా కుటుంబానికే చెందిన బ్ర‌హ్మానంద రెడ్డిని లైన్‌ లోకి తెచ్చి సెంటిమెంట్ అస్ర్తం ప్ర‌యోగించి గెలిచేందుకు ప్ర‌యత్నించారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన శిల్పా.. టీడీపీలో ఎంత సేవ చేసినా గుర్తింపు లేద‌ని పేర్కొంటూ జ‌గ‌న్ చెంత‌కు చేరారు.

అప్ప‌టి ఉప ఎన్నిక‌లో హోరా హోరీ త‌ల‌ప‌డ్డారు. కొద్దిపాటి తేడాతో శిల్పా ప‌రాజయం చ‌విచూశారు. ఇది అంత‌టితో అయిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన చంద్ర‌బాబు మాత్రం త‌న పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన శిల్పాను వ‌దిలి పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారో ఏమో.. వేధింపుల‌కు తెర‌దీశారు. దీనిలో భాగంగా ఆయ‌న తొలి అస్త్రం ప్ర‌యోగించారు. మోహన్‌ రెడ్డి గన్‌ మెన్లను తొలగించారు. శిల్పాతో పాటుగా నంద్యాల మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన గన్‌మెన్లను కూడా తొలగించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

గన్‌మెన్ల తొలగింపుపై వైసీపీ అధినేత జగన్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న తరుణంలో శిల్పా మోహన్‌ రెడ్డి గన్‌ మెన్లను తొలగించడంపై జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యం పూర్తిగా రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌గా అంద‌రూ దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి ఫ్యాక్ష‌న్ జిల్లా అయిన క‌ర్నూలులో శిల్పా వంటి కీల‌క నేత‌ల‌కు గ‌న్‌ మెన్లు అవ‌స‌ర‌మ‌నేది ప్ర‌భుత్వానికి తెలియంది కాదు. అయినా కూడా ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటే.. కేవలం తాను పార్టీ మార‌డ‌మే కార‌ణ‌మ‌ని శిల్పా.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు సంధించారు. ఇలాంటి ప‌రిణామాలు రాజ‌కీయాల్లో కొత్త‌కాద‌ని, వీటిని అవ‌స‌ర‌మైతే న్యాయ‌స్థానాల్లో సైతం స‌వాలు చేస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.