Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ బీద మాటలేంది బాబు?

By:  Tupaki Desk   |   12 July 2016 7:07 AM GMT
వామ్మో.. ఈ బీద మాటలేంది బాబు?
X
విభజనతో ఏపీకి ఆర్థికకష్టాలు ఏర్పడిన మాట వాస్తవం. దీన్ని ఎవరూ కాదనలేనిది. అంతమాత్రానికే ప్రతి విషయానికి బీద అరుపులు వేయటం ఏ మాత్రం బాగోదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లోనే చెప్పాలంటే.. ఎంత డబ్బుల్లేకపోతే మాత్రం చెట్ల కింద కూర్చొని పని చేస్తామా? మంచి ఆఫీసు కట్టుకోకపోతే మన దగ్గర పెట్టుబడి పెట్టటానికి ఎవరైనా వస్తారా? వారు మనల్ని మర్యాదగా చూస్తారా? అంటూ తాను విపరీతంగా ఖర్చులు పెడుతున్నానని విమర్శించే వారి మీద ఆయన విరుచుకుపడుతుంటారు. బాబు వాదన విన్నప్పుడు.. నిజమే కదా? ఆయన చెప్పిన దాన్లోనూ పాయింట్ ఉంది కదా అని అందరూ అనుకునే పరిస్థితి.

మరిన్ని పాయింట్లు తెలిసిన పెద్ద మనిషి.. ఏపీ సర్కారు తరఫున హైకోర్టులో తాజాగా చెప్పిన మాట వింటే సిగ్గుతో తల వాలిపోయే పరిస్థితి. పరీక్షల్లో కాపీల్ని నిరోధించటం కోసం సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ఆదేశిస్తే.. అది తమ వల్ల కాదని.. తమ దగ్గర అంత డబ్బుల్లేవని.. తమది పేద సర్కారు అంటూ చెప్పిన మాటలు షాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండే ఆఫీసుల కోసం.. క్యాంప్ కార్యాలయాల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేసేందుకు వెనుకాడని చంద్రబాబు హైకోర్టు సూచించిన సీసీ కెమేరాల విషయంలో మాత్రం బీద అరుపులు అరవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యటనల కోసం ప్రైవేటు విమానాల్ని ఉపయోగించే చంద్రబాబు.. లక్షలాది మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వటంతో పాటు.. లోపాల్ని సవరించేందుకు వీలున్న సూచనను అమలుచేసేందుకు నిధులు లేవని చెప్పటం.. పేదరికపు మాటలు చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పరీక్ష హాళ్లలో సీసీ కెమేరాలకు అయ్యే ఖర్చు ఎంతన్న విషయాన్ని చూస్తే.. అది కేవలం రూ.30 కోట్లు మాత్రమే.

ఈ మాత్రం ఖర్చుకే డబ్బుల్లేవంటూ బీద అరుపులు వింటే.. ఏ పెట్టుబడిదారుడైనా ఏపీకి వచ్చే ఛాన్స్ ఉందా? అంటూ ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు ఏపీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? కేవలం తన ఆఫీసుల కోసమే (రెండు రాష్ట్రాల్లో) దాదాపు రూ.80 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లుగా చెబుతారు. అలాంటిది రూ.30కోట్లు ఖర్చు చేసేందుకు ఇంత బీద అరుపులు అరవటం వెనుక అసలు కారణం ఇంకేదైనా ఉందా చంద్రబాబు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పరపతిని దెబ్బ తీసే ఇలాంటి మాటలు ఏపీకి ఏ మాత్రం మంచివి కావన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.