Begin typing your search above and press return to search.

బాబు...ప‌వ‌న్‌..ఓ ర‌హ‌స్య బంధం

By:  Tupaki Desk   |   7 Dec 2017 9:54 AM GMT
బాబు...ప‌వ‌న్‌..ఓ ర‌హ‌స్య బంధం
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ మ‌ధ్య ఉన్న రహ‌స్య బంధం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చిందంటున్నారు. జ‌న‌సేన పార్టీ అధినేత పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఈ అభిప్రాయం తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డ్డప్పుడ‌ల్లా ప‌వ‌న్ ఎంట్రీ ఇస్తుంటార‌ని...తాజా ప‌ర్య‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. `నువ్వుకొట్టిన‌ట్లు చేస్తే..నేను ఏడ్చిన‌ట్లు చేస్తా` అన్న‌ట్లుగా ఈ ఇద్ద‌రు మిత్రుల బంధం ఉంద‌ని చెప్తూ ప‌వ‌న్‌ ప‌ర్య‌ట‌న‌ - చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇందుకు ఉదాహ‌ర‌ణ అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

పోలవరం ప్రాజెక్టును సంద‌ర్శిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఒకింత ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పోల‌వ‌రం నిర్మాణంలో అవకతవకలున్నాయని ప‌వ‌న్‌ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పదని ప‌వన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజాలు దాస్తున్న కొద్ది సందేహాలు కలుగుతున్నాయని ప‌వన్ కామెంట్ చేశారు. ఇంతేకాకుండా...ప్రాజెక్టు ప‌నులు కొన‌సాగేలా కేంద్రంతో ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. అవ‌స‌రమైతే తాను స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు.

ఇలా త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌డం - సూచించ‌డంతో ప‌వ‌న్ రియాక్ట‌వ‌గా..ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూల్ రిప్లై ఇచ్చారు. పోల‌వరం ప్రాజెక్టు విష‌యంలో ప‌వ‌న్ కామెంట్ల‌ను రాజ‌కీయంగా తీసుకోవ‌ద్ద‌ని సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కావాల‌న్న‌దే ప‌వ‌న్ ఆకాంక్ష అని ఆయ‌న్ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఎప్పటిక‌ప్పుడు తాము వివ‌రాలు అందిస్తున్నందున ప్ర‌త్యేకంగా శ్వేత‌ప‌త్రం అవ‌స‌రం లేద‌ని తెలిపారు. త‌ద్వారా పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌న్నింటికీ..ప‌వ‌న్ టూర్ రూపంలో క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఏపీలో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు యాత్ర చేప‌ట్ట‌డానికి ముందే...ప‌వ‌న్ యాత్ర జ‌ర‌గ‌డం ప‌లు వ‌ర్గాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. అందులోనూ ఇన్నాళ్లుగా విప‌క్షంగా స్పందించ‌ని ప‌వ‌న్ ఇప్పుడు యాత్ర చేప‌ట్ట‌డం అందులోనూ విమ‌ర్శ‌లు చేయ‌డం చూస్తుంటే...వైసీపీ టూర్ ఎఫెక్ట్‌ ను త‌గ్గించేందుకేన‌ని అంటున్నారు. స్థూలంగా ఇటు కేంద్ర ప్ర‌భుత్వం కొర్రీలు...ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ టూర్ నేప‌థ్యంలో విమ‌ర్శ‌ల జోరు నుంచి దృష్టి మ‌ళ్లించేందుకే బాబు - ప‌వ‌న్ క‌లిసి ప్ర‌య‌త్నం చేశార‌ని ప‌లు వ‌ర్గాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి.