Begin typing your search above and press return to search.

మీరేం వదులుకున్నారు చంద్రబాబు..?

By:  Tupaki Desk   |   4 Jan 2016 4:58 AM GMT
మీరేం వదులుకున్నారు చంద్రబాబు..?
X
త్యాగాలు చేయాలని చెప్పటం రాజకీయ నేతలకు అలవాటే. ప్రజల్ని త్యాగాలు చేయమని చెప్పే నేతలు.. తమకు తాముగా ఎలాంటి త్యాగాలు చేశామన్న విషయాల్ని మాట వరసకు చెప్పటం అస్సలు కనిపించదు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మినహాయింపు కాదు. ఈ మధ్యకాలంలో ఆయన ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. మోడీ సర్కారు మనసు దోచుకోవటానికన్నట్లుగా. . కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలకు ప్రచారం చేయటం మొదలు పెట్టారు. తాజాగా సంపన్నులకు గ్యాస్ సబ్సిడీ కత్తెర వేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దానికి సంబంధించిన ప్రకటన వెలువడటం తెలిసిందే.

వార్షిక పన్ను ఆదాయం రూ.10లక్షలు దాటిన వారికి ఇప్పటివరకూ ఇచ్చే గ్యాస్ సబ్సిడీని మినహాస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా ప్రస్తావించిన చంద్రబాబు.. శ్రీమంతులు సబ్సిడీల్ని వదులుకోవాలని.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని తీసుకోకుంటే.. వాటిని మరింత ఎక్కువగా పేద ప్రజలకు ఇవ్వొచ్చని చెప్పారు.

త్యాగాలు చేయమని పిలుపు ఇస్తున్న చంద్రబాబు.. అంతకంటే ముందు.. తనకు తానుగా ఎలాంటి త్యాగాలు చేశారో చెప్పాలి? చిన్న ఇంట్లో ఉంటున్నారా? పరిమిత కాన్వాయ్ వినియోగిస్తున్నారా? ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్నారా? తన ఆస్తిలో 50 శాతానికి పైనే ప్రజలకు అంకితం చేశారా? ఇలాంటివాటిల్లో ఒక్కటైనా చంద్రబాబు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ చేశారా? మరి.. తమ వరకు తాము ఎలాంటి త్యాగాలు చేయమని బాబు అండ్ కో.. ప్రజలకు మాత్రం వాటిని వదులుకోండి? వీటిని వదులుకోండి? సబ్సిడీలు తీసుకోవద్దని ఎలా చెబుతారు? సలహాలు చెప్పే ముందు తనకు తాను అమలు చేసిన తర్వాత చెబితే అందంగా ఉంటుందన్న విషయాన్ని బాబు తెలుసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.