Begin typing your search above and press return to search.

ఈ టొయామా స్పెషల్ ఏంది?

By:  Tupaki Desk   |   29 Dec 2015 4:46 AM GMT
ఈ టొయామా స్పెషల్ ఏంది?
X
సోమవారం ఇద్దరు ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వారిలో ఒకరు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అయితే.. మరొకరు జపాన్ లోని టొయామా గవర్నర్ తకకాజు. మైక్రోసాఫ్ట్ గురించి.. సత్యనాదెళ్ల గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కానీ.. జపాన్ లోని టొయామా రాష్ట్ర గవర్నర్ ఏపీతో కుదుర్చుకున్న ఐదు అవగాహన ఒప్పందాలు ఏపీకి ఎంతో మేలు చేసేవన్న మాట వినిపిస్తోంది.

ఏపీ కుదుర్చుకున్న ఒప్పందాలు ఏమిటనే దాని కన్నా.. టొయామా రాష్ట్ర ప్రత్యేకత తెలుసుకోవటం ద్వారా.. ఏపీ కుదర్చుకున్న ఒప్పందాలు ఎంతటి కీలకమైనవో ఇట్టే తెలుస్తుంది. టయామా రాష్ట్ర గవర్నర్ తకకాజుతో పాటు 19 మందితో కూడిన బృందం ఏపీకి వచ్చింది. ఇక ఈ రాష్ట్ర ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఏపీతో పోలిస్తే..జపాన్ కు చెందిన టొయామా రాష్ట్రం చాలా చిన్నదిగా చెప్పాలి. ఈ రాష్ట్ర జనాభా 10 లక్షలు మాత్రమే. అయితే.. సాంకేతికంగా చాలా ముందున్న రాష్ట్రం. రోబోల తయారీలో ఈ రాష్ట్రం చాలా ప్రముఖమైంది. ఈ రాష్ట్రానికి చెందిన వైకేకే కంపెనీ 71 దేశాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.

ఈ రాష్ట్రంలో 100 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కేవలం 11 ఏళ్ల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పర్యాటకం ఏడు రెట్లు పెరగటం గమనార్హం. జపాన్ లో ప్రముఖ రాష్ట్రంగా రూపుదిద్దుకోవటానికి టొయోమాకు 132 ఏళ్లు పట్టింది.. కానీ.. ఏపీ ఏర్పడిన ఏడాదిన్నరలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ తకకాజు వ్యాఖ్యలు చేయటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గడిచిన 30 ఏళ్లలో ఈ రాష్ట్రానికి చెందిన ఐదుగురికి నోబెల్ బహుమతులు దక్కాయి.