Begin typing your search above and press return to search.

భవిష్యత్ లో బంద్ చేయరా చంద్రబాబు?

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:20 AM GMT
భవిష్యత్ లో బంద్ చేయరా చంద్రబాబు?
X
రాజకీయ నాయకులు.. పార్టీలకు బంద్ లకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతదాకా ఎందుకు ఇప్పుడు బంద్ అంటే అంతెత్తు ఎగిరి పడుతున్న చంద్రబాబు సైతం.. తానుపదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన సమయంలో ఎన్ని బంద్ లకు పిలుపునిచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పుడు లేని బాధ ఇప్పుడే ఏదో వచ్చేసినట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. అలాంటి వేళ.. బంద్ లు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

బంద్ లు చేయటం వల్ల జరిగే ఆర్థిక నష్టం గురించి అదే పనిగా ఆయన చిట్టా విప్పుతున్నారు. బంద్ వల్ల జరిగిన ప్రయోజనం ఏమిటో చెప్పాలని కూడా నిలదీస్తున్నారు. నిజమే.. బాబు చెప్పినదాన్లో పాయింట్ ఉంది. బంద్ కారణంగా ఏపీకి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం ఉండదనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక పరిస్థితి మీద అంత శ్రద్ధే ఉంటే.. గడిచిన రెండేళ్ల వ్యవధిలో దుబారా ఖర్చులు ఎన్ని పెట్టలేదు? వాటి కారణంగా కోట్లాది రూపాయిలు వృధా అయ్యాయి. మరి వాటి మాటేంటి?

డబ్బు లెక్క ఎక్కడైనా లెక్కే. చంద్రబాబుదైతే ఒక లెక్క.. జగన్ ది అయితే ఇంకో లెక్క అన్నదేదీ ఉండదు. కానీ.. చంద్రబాబు మాటలు చూసినప్పుడు మంగళవారం ఏపీ విపక్షాలు చేపట్టిన బంద్ కారణంగా ఏపీ రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందన్న మాటను పదే పదే చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆయన చెప్పినట్లు బంద్ కారణంగా ఏపీ నష్టపోయిందని అనుకుందాం. మరి.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెబెతున్నారుకదా.. మరి.. పొత్తు కారణంగా ఏపీకి ఏమైనా ప్రత్యేకంగా ప్రయోజనం జరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది.

అధికారపక్ష నేతగా బంద్ ల మీద పదే పదే విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. ఈ విషయం మీద అవసరానికి మించి రియాక్ట్ అవుతున్నారన్న భావన కలుగుతుంది. ఇవాల్టి రోజున బంద్ లకు వ్యతిరేకంగా మాటలు చెబుతున్న చంద్రబాబు.. రేపొద్దున ఏదో ఒక రోజున అధికారానికి దూరమైన వేళ కూడా బంద్ లకు పిలుపునివ్వరా? బంద్ లకు పిలుపు ఇచ్చే విషయంలో టీడీపీ ఏమైనా కొత్త పాలసీ తీసుకుందా? ఆ పార్టీ ఎప్పటికి బంద్ లకు కాల్ ఇవ్వదా? లాంటి అంశాల మీద స్పష్టత ఇచ్చాక.. చంద్రబాబు మాటలు చెబితే బాగుంటుంది. అదేమీ లేకుండానే.. విపక్షాలు చేసిన బంద్ కారణంగా రాష్ట్రం చాలా ఆదాయం కోల్పోయిందంటూ చేసే వ్యాఖ్యలు చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయమని చెప్పొచ్చు. ఒకవైపు కేంద్రం దారుణంగా వ్యవహరిస్తుంటే.. దానికి నిరసన చేపడితే.. ఆ భావోద్వేగ విషయాన్ని డబ్బు లెక్కతో ముడివేస్తూ ప్రెస్ మీట్ పెట్టటం ఏం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.