Begin typing your search above and press return to search.

ఓపెన్ గా మాట్లాడిన బాబు మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   2 July 2016 7:59 AM GMT
ఓపెన్ గా మాట్లాడిన బాబు మాటలు విన్నారా?
X
కేంద్రం మీద బాబు ఎందుకు విరుచుకుపడరు? మోడీ అంటే భయమా? కేసీఆర్ మాటకు కౌంటర్ ఎందుకు చెప్పరు? ఓటుకు నోటు కేసులో బుక్ అవుతానన్న భయంతోనా? రెండేళ్లు అవుతున్నా హైకోర్టు విభజన ఎందుకు జరగటం లేదు? దీనికి బాబు దోషా? ఢిల్లీలోని ఏపీ భవన్ తెలంగాణకు ఇచ్చేయాలని కేసీఆర్ అంటే బాబు దాని మీద ఎందుకు మాట్లాడరు? తన వాదన ఎందుకు వినిపించరు? ప్రతిదానికి బాబు మౌనంగా ఎందుకు ఉంటారు? చేతకానితనమా? చేవ లేనితనమా? ఇలాంటి ప్రశ్నలెన్నో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుమీద వినిపిస్తుంటాయి. మరి.. వీటి మీద బాబు మాటేంది? ఆయన ఎందుకలా మౌనంగా ఉంటారు? మాటకు మాట అన్నట్లుగా ఎందుకు రియాక్ట్ అవ్వరు? లాంటి ప్రశ్నలు చాలా వాటికి తాజాగా ఆయన సమాధానం చెప్పారు. తన సహజ శైలికి భిన్నంగా ఓపెన్ అయి మాట్లాడిన మాటలు చూస్తే..

= హైకోర్టు ఇష్యూలో తెలంగాణలో జరిగేది అనవసర రార్ధాంతం. విభజన సమయంలో అన్ని వదులుకున్నాం. హైకోర్టు వదులుకోలేమా? అదేం పెద్ద విషయం కాదు.

= అమరావతిలో ఐకానిక్ గా ఉండేలా శాశ్విత హైకోర్టు భవంతి నిర్మాణం మొదలు పెడుతున్నాం. దీనికి కొంత సమయం పడుతుందంతే. ఇక్కడే ఉండిపోవాలని లేదు. ఏదో ఒక షెడ్డు వేయాలనుకుంటే మూడు నెలల్లో అయిపోతుంది. కానీ.. దాన్నో ఐకానిక్ గా కట్టాలనుకుంటున్నాం. అందుకే ఆలస్యం అవుతుంది.

= ఏపీలో హైకోర్టు కట్టుకున్న తర్వాత తరలిస్తే.. ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణఖు వస్తుందని విభజన చట్టంలో చెప్పారు. గొడవలు పెట్టుకోవాలని నాకు లేదు. ఏవైనా సామరస్యంతో పరిష్కరించుకోవాలి. చట్టం అన్నింటికీ ఒకే విధంగా ఉంటుంది తప్ప.. మనకు అనుకూలంగా ఉన్నదే చేయాలనుకోవటం కరెక్ట్ కాదు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామని మొదట్నించి చెబుతున్నా. కానీ.. స్పందించటం లేదు.

= సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్యనున్న ఆస్తుల పంపకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. కేంద్రాన్ని కోరినా అక్కడ నుంచీ స్పందన లేదు. ఏదో ఒకటి అనటానికి ఒక్క నిమిషం పట్టదు. నాకు మాత్రం నోరు లేదా? అందరం సయోధ్యతో ముందుకు పోదామని చెబుతున్నా.

= తెలంగాణ సీఎంతో మాట్లాడటానికి నాకేం భేషజనం లేదు. వారికి కావాల్సినవి అడుతున్నారు. చట్టంలో ఉన్నవాటిని మాత్రం కాదంటున్నారు. నేను ఉభయతారకమైన పరిష్కారానికి సిద్ధం. నేను వాళ్లకీ.. వీళ్లకీ భయపడుతున్నానని కొందరు మాట్లాడుతున్నారు. అదేం కాదు. గొడవలు పడితే సాధించేదేమీ ఉండదు.

= రెండురాష్ట్రాలకూ స్వయం ప్రతిపత్తి ఉంటుంది.రాజకీయాలు వేరు. రాష్ట్రాలువేరు. వారి వారి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి.

= మనమంతా ఒక్కటే.. తెలుగువారం. మీరు విభజన కావాలనుకున్నారు అయిపోయింది. ఇంకాకొందరు రెచ్చగొడుతున్నారు. వివాదాలు పెట్టుకోవటం సరికాదు.

= విభజనలో అన్యాయం ఆంధ్రాకి జరిగింది. ఒకప్పుడు చెన్నై వెళ్లాం. అక్కడి నుంచి కర్నూలుకు వచ్చాం. తర్వాత హైదరాబాద్ కు వెళ్లాం.ఇప్పుడు కట్టుబట్టలతో కాదు అప్పులతో బయటకు వచ్చాం. మా దగ్గర డబ్బుల్లేవు. జీతాలకూ లేవు. మాకు రెండు విదాలా ఖర్చు.

= హైదరాబాద్ లో ఆఫీసు నిర్మించుకున్నాం. ఇక్కడికి వస్తూనే బస్సులో పడుకున్నా. అక్కడ నుంచి ఈ ఆఫీసు కట్టుకున్నా. మళ్లీ ఇప్పుడు అమరావతిలో కట్టుకుంటున్నాం. హైదరాబాద్ ఆపీసులకు డబ్బు కొంత అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది. ఆఫీసు లేకుండా చెట్ల కింద మాట్లాడలేం కదా? ఎవరినైనా పిలిచి చెట్ల కింద మాట్లాడితే రాను కూడా రారు కదా.

= ఢిల్లీలోని ఏపీ భవన్ విషయంలో ఢిల్లీలో ఉన్న నిజాం భవాన్ని కేంద్రం తీసేసుకుంది. నేను సీఎంగా.. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో నేను మాట్లాడిన దానికి బదులుగా ఏడెకరాల స్థలాన్ని ఢిల్లీలో తీసుకున్నాం. అలాంటివి అనవసరంగా వివాదాస్పదం చేయటం సరికాదు.

= అపెక్స్ సంస్థ.. బోర్డులు ఉంటే సమావేశం జరపకుండా మీరు.. మీరు పరిష్కరించుకోండంటే ఎలా అవుతుంది? ఆస్తుల విషయంలో ఏకపక్ష వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఉన్నత విద్యామండలి కేసులో ఇచ్చిన తీర్పు అమలు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం కనీసం స్పందించలేదు.