Begin typing your search above and press return to search.

బాబు నోట వెంకయ్య మాట

By:  Tupaki Desk   |   11 Oct 2015 4:35 AM GMT
బాబు నోట వెంకయ్య మాట
X
ఒకేలాంటి వాదన ఇద్దరు నేతల నోటి వెంట వేర్వేరు సమయాల్లో రావటం కాస్తంత విశేషమే. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం చేసిన వ్యాఖ్యల్ని.. అదే రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించటం కాస్తంత విశేషమే. ఓపక్క ప్రత్యేక హోదా కోసం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక దీక్ష చేస్తూ.. ఏపీ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న సమయంలో.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి సీమాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకేలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వెంకయ్య నోటి నుంచి ఏ వాదన అయితే వినిపించిందో.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే తీరులో వాదనను వినిపించటం విశేషం. అన్నీ సమస్యలకు ప్రత్యేక హోదా పరిష్కారం కాదని.. అన్నీ సమస్యలకు జిందాతిలిస్మాన్ మాదిరి.. ఏపీ విభజన సమస్యలకు ప్రత్యేక హోదా పరిష్కారం కాదని.. దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏమిటన్న విషయం తనకు తెలుసని.. వారు తన దగ్గరకు వచ్చి మాట్లాడే విషయాలేంటో తెలుసన్న ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా తోనే అంతా అయిపోవద్దని భావించొద్దని వెంకయ్య చెబుతున్నారు.

ఆయన నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా కాకముందే.. అలాంటి మాటల్నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట రావటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జగన్ దీక్షను పరోక్షంగా ప్రస్తావించిన చంద్రబాబు.. అన్నీ సమస్యలకు ప్రత్యేక హోదా పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలంటూనే.. ప్రత్యేక ప్యాకేజీ కూడా అవసరమని తేల్చారు. అవ్వా కావాలి బువ్వా కావాలంటూనే.. అవ్వ లాంటి ప్రత్యేక హోదా ఇచ్చినా.. ఇవ్వకున్నా కేంద్రంతో సఖ్యత చాలా అవసరమన్న మాటను పరోక్షంగా బాబు తన మాటలతో స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి.. మద్ధతు ఉపసంహరించుకోవాలని చెబుతున్నారని.. ఏపీకి చాలా చేస్తానన్న నమ్మకంతో తనకు అధికారం ఇచ్చిన ప్రజల కోసం తాను చాలానే చేయనున్నానని .. ఈ దశలో కేంద్రంతో తగువు ఏ మాత్రం మంచిది కాదన్న వాదనను బాబు వినిపించారు. విపక్షం కోరినట్లుగా కేంద్రంతో తగువు తన వైఖరి కాదని.. బతిమిలాడో.. బామాడో కేంద్రం నుంచి ప్రాజెక్టులు తెచ్చుకోవటమే తన లక్ష్యంగా చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో మద్ధతు ఉపసంహరించుకోవటం సరికాదన్న వాదనను బలంగా వినిపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఘర్షణ కంటే కూడా.. ఒత్తిడితో పనులు పూర్తి చేసుకోవాలన్న తపన బాబు మాటల్లో వ్యక్తమవుతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇచ్చిన వివరణ చూసినప్పుడు కేంద్రంతో తగువు పెట్టుకునే ఉద్దేశ్యం తనకే మాత్రం లేదన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేశారని చెప్పొచ్చు.