Begin typing your search above and press return to search.
అవార్డులకు కూడా కులం ఆపాదిస్తారా?:బాబు
By: Tupaki Desk | 20 Nov 2017 1:04 PM GMT2014 - 2015 - 2016 సంవత్సరాలకు గానూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు టాలీవుడ్ తో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కనుసన్నల్లోనే కుల ప్రాతిపదికన జ్యూరీ సభ్యులు ఆ అవార్డులను తమకు నచ్చిన వారికి `బట్వాడా` చేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. `బావమరిది` బాలకృష్ణ సినిమా `లెజెండ్`కు `నవ` నందులు రావడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని కొందరు తమ అక్కసును మీడియా సాక్షిగా వెళ్లగక్కారు. హైదరాబాద్ లో కూర్చొని కొందరు నంది అవార్డులపై రాద్ధాంతం చేస్తున్నారని, ఆ విమర్శలపై తన తండ్రి చంద్రబాబు బాధపడ్డారని మంత్రి లోకేష్ బాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఓ కార్యక్రమం సందర్భంగా ఈ వివాదంపై చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న `నంది` వివాదంపై చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన వ్యూహకమిటీ సమావేశంలో `నంది` వివాదం ప్రస్తావన సీఎం వద్దకు వచ్చింది. దీంతో, చంద్రబాబు ఆ వివాదంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ అవార్డులపై ఇంత వివాదం జరుగుతుందని, దానిని ఇంత రాద్ధాంతం చేస్తారని తాను అనుకోలేదని చంద్రబాబు అన్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన వారికే అవార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ అవార్డులపై ఇంత గొడవ జరుగుతుందనుకుంటే పారదర్శకంగా `ఐవీఆర్ఎస్` సర్వే చేయించి ప్రజాభిప్రాయం ప్రకారమే నంది అవార్డులను ప్రకటించేవాళ్లమని చెప్పారు. ఆఖరికి అవార్డులకు కూడా కులాన్ని ఆపాదించడం దురదృష్టకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో అవార్డులు ప్రకటించడం ఆలస్యమైందని, అందుకే మూడేళ్ల అవార్డులు ఒకేసారి ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే, ఈ విధంగా మూడు సంవత్సరాల అవార్డులు ఒకేసారి ఇచ్చి ఉండాల్సింది కాదని, అందువల్లే ఈ వివాదాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.