Begin typing your search above and press return to search.

బీజేపీ విషయంలో బాబు పునరాలోచనలో పడ్డారా?

By:  Tupaki Desk   |   14 July 2018 2:30 PM GMT
బీజేపీ విషయంలో బాబు పునరాలోచనలో పడ్డారా?
X
ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ముందు దోషి కాకుండా నెపం కేంద్రంపై నెట్టేసి సేఫ్‌ గా బయటపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్రం ఏమీ చేయలేదని టీడీపీ... తామెంతా చేసినా అది టీడీపీ ప్రభుత్వం వారి ఖాతాలో వేసుకుంటోందని... కేంద్రం ఇచ్చిన డబ్బుకు లెక్కలు చూపడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు పార్టీల నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక బీజేపీ - టీడీపీ కాంబినేషన్ లేనట్లేనని అందరికీ స్పష్టమైపోయింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నట్లుగా ఇటీవలి రాజకీయ పరిణామాలు చెప్తున్నాయి. కానీ.. హఠాత్తుగా చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ కూడా చంద్రబాబును మళ్లీ అక్కున చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లూ తెలుస్తోంది. అయితే.. ఎవరికి వారు బిగుసుకుని ఉండడంతో ఈ రీయూనియన్ ముందుకెళ్లడం లేదని సమాచారం. అయితే... రెండు పార్టీలను మళ్లీ కలిపేందుకు నితిన్ గడ్కరీ ప్రయత్నిస్తున్నట్లు టాక్. మరోవైపు చంద్రబాబు కూడా తాజాగా తన వ్యాఖ్యలతో బీజేపీతో కలవకూడదని ఏమీ లేదన్న సంకేతం ఇచ్చారు.

విభజన హామీలను అమలు చేయకపోవడం వల్లే బీజేపీకి టీడీపీ దూరమైందని - ఆ హామీలు నెరవేరిస్తే ఇక ఇబ్బందులేముంటాయని సీఎం చంద్రబాబు తాజాగా అనడమే దీనికి ఉదాహరణ. విశాఖపట్టణం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు బీజేపీ విషయంలో పునరాలోచనలో ఉన్నారన్న విషయం స్పష్టమైంది.

విభజన హామీలన్నింటిని కేంద్రం నెరవేరుస్తామని చెబుతోంది కానీ - ఎంత సమయంలో వాటిని అమలు చేస్తారనేది ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ఈ హామీలను ఐదేళ్లలో కాకుండా పదేళ్లలో అమలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలని - విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయికీ కేంద్రానికి లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధమని అన్నారు. ‘పోలవరం’ ఖర్చు మొత్తాన్ని భరిస్తామన్న నితిన్ గడ్కరీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు. మొత్తానికి పొత్తులు తెగతెంపులైన తరువాత బీజేపీలోని కీలక నేతతో చంద్రబాబు ఇంతగా ఇంటరాక్ట్ కావడం ఇదే తొలిసారి.

అదేసమయంలో గడ్కరీ కూడా చంద్రబాబుకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించారు. అదెంతలా అంటే... బీజేపీ కార్యకర్తలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తుంటే వద్దని గడ్కరీ వారించారు. ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాలులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నప్పుడు.. బీజేపీ కార్యకర్తలు 'మోదీ మోదీ' అంటూ నినాదాలు చేయడంతో వారిపై నితిన్‌ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇది కేవలం చంద్రబాబును ఊరడించడానికేనని అర్థమవుతోంది. అసలే బీజేపీపై చంద్రబాబు రగులుతున్న సమయంలో ఆయన పాలనలో ఉన్న రాష్ట్రంలో.. ఆయన పాల్గొన్న కార్యక్రమంలో ఇలా మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తే చంద్రబాబు ఎంతగా క్షోభకు గురవుతారో గడ్కరీకి అర్థమైనట్లుంది. అందుకే.. ఆయన వారిని వారించారని.. చంద్రబాబును మంచి చేసుకునే ప్రయత్నంలోనే ఇలా చేశారని.. లేదంటే మోదీ పేరు మార్మోగుతుంటే కేంద్రంలో పెద్దలెవరూ ఆపే ప్రయత్నం చేయరని వినిపిస్తోంది. మొత్తానికి బాబు - గడ్కరీ ఇద్దరూ ఎవరికి వారు తమ పార్టీని పాత మిత్రుడికి చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.