Begin typing your search above and press return to search.

సమీక్షల పిచ్చ బాబును వదలదా?

By:  Tupaki Desk   |   21 March 2016 10:12 AM IST
సమీక్షల పిచ్చ బాబును వదలదా?
X
తొమ్మిదిన్నరేళ్లు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేసి.. పదేళ్ల విరామం తర్వాత మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం వస్తే.. గతంలో తన కారణంగా జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుంటారు. అదేం ఖర్మో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మాత్రం అలాంటి మార్పు అస్సలు కనిపించదు.

తొమ్మిదిన్నరేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెలికాన్ఫరెన్స్ ల పేరిట ప్రభుత్వ ఉద్యోగుల్ని గంటల తరబడి సమావేశాలు నిర్వహించే ఆయన.. తాజాగా కూడా ఆ విధానాన్ని వదలకపోవటం గమనార్హం. అత్యున్నత అధికారులతో పాటు.. కిందిస్థాయి అధికారుల వరకూ సమీక్షల పేరిట గంటల తరబడి సమావేశాలు నిర్వహించటంపై మొదట్నించి విమర్శలున్నాయి.

కానీ.. ఈ విషయంపై చంద్రబాబులో మార్పు రాని పరిస్థితి. ఉన్నతాధికారులతో గంటల తరబడి సమావేశాలు నిర్వహిస్తున్నఆయన సమయపాలనను పాటించటం లేదన్న ఫిర్యాదుబలంగా వినిపిస్తోంది. దీంతో.. పాలన మీద దృష్టి సారించాల్సిన కీలక అధికారులంతా సమావేశాల కోసం వెయిట్ చేయటమో.. సీఎంతో సమావేశాలతోనో బుక్ అయిపోతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఒకేసారి వేలాది మంది అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లుగా గొప్పలు చెప్పుకునే ఏపీ సర్కారు.. దీని కారణంగా వేలాది పని గంటలు వృధా అవుతున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. క్షేత్రస్థాయిలో పని మీద దృష్టి పెట్టాల్సిన అధికారి.. అందుకు భిన్నంగా సీఎం సమీక్ష కోసం తన రోజును కేటాయించటం వల్ల నష్టం ఎక్కువన్న సంగతి బాబుకు ఎందుకు అర్థం కాదో? ఇప్పటికైనా సమీక్షల జోరు తగ్గించటం.. అత్యవసరం అనుకుంటే.. పక్కా సమయపాలనను పాటించాలే తప్ప.. సమయం వృధా అయ్యేలా వ్యవహరించకూడదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది.