Begin typing your search above and press return to search.

కేసీఆర్ లాంటి త‌ప్పు చేయ‌ద్దంటున్న బాబు

By:  Tupaki Desk   |   27 Oct 2016 4:56 AM GMT
కేసీఆర్ లాంటి త‌ప్పు చేయ‌ద్దంటున్న బాబు
X
తెలంగాణ‌లో ఇపుడు స‌ర్వ‌త్రా చ‌ర్చనీయాంశం కొత్త స‌చివాల‌యం నిర్మాణం.కేవ‌లం వాస్తు బాగా లేద‌నే కార‌ణంతో చ‌క్క‌గా ఉన్న స‌చివాల‌య భ‌వనాలు నేల‌మ‌ట్టం చేసి వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో కొత్త నిర్మాణాలు చేప‌ట్టేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూకుడుగా ముందుకుపోతున్నారు. ఈ ప‌రిణామంపై తెలంగాణ‌లోని విప‌క్షాలు మండిప‌డుతుండ‌గా...ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఇలాంటి త‌ప్పు జ‌ర‌గ‌వ‌ద్ద‌ని త‌న అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు యనమల రామకృష్ణుడు - పి.నారాయణలతో కలిసి అమరావతి నగర నిర్మాణంపై స‌మీక్షించిన సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఈ క్లారిటీ ఇచ్చారు.

అమ‌రావ‌తి నిర్మాణం ప‌క‌డ్బందీగా - ప్ర‌ణాళిక బ‌ద్దంగా ఉండాల‌ని చెప్పిన చంద్ర‌బాబు ఈ మేర‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న‌న్నారు . భవిష్యత్తులో ఎవరూ కూడా వాస్తు సక్రమంగా లేదంటూ భవంతులు కూల్చకుండా వాస్తు నిపుణులతో ఒక కమిటీ వేసి సలహాలు తీసుకుందామని ఈ సమావేశంలో చెప్పారు. వాస్తు ప‌ర‌మైన అంశాలు ముఖ్య‌మైనందున వాటితో చిక్కులు రాకుండా ఉండేందుకు ఇదే అత్యుత్త‌మమైన మార్గ‌మంటూ బాబు విశ్లేషించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమరావతి నగర నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఇప్పుడున్న వేగం సరిపోదని - ఫాస్ట్‌ ట్రాక్ పద్ధతిన పనులు చురుగ్గా జరిగేలా చూడాలని సీఆర్‌ డీఎ అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్‌ కు ఇవతల ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉన్నదని - అవతలివైపు కొండపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చంద్ర‌బాబు సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయం - ఇస్కాన్ సారథ్యంలో కృష్ణుడి మందిరం నిర్మాణం అవుతాయని, వీటితో పాటు మసీదు - చర్చిల నిర్మాణం కూడా చేపట్టి అన్నివర్గాల వారికి అమరావతి దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దుదామని చెప్పారు.

ఈ సందర్భంగా ‘టార్గెట్ 2018’ అనే కాన్సెప్ట్‌ తో కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ ఇచ్చిన ప్రెజెంటేషన్‌ ను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పరిశీలించారు. ల్యాబ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడానికి ఈ ప్రణాళికను రూపొందించినట్టు సీఆర్‌ డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ వివరించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక - గ్రావెల్, - ఇటుకలు - ఇతర నిర్మాణ సామాగ్రిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటి నిమిత్తం సమీపంలో వున్న వనరులను వినియోగించుకోవడం ద్వారా రూ.3వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా వేసినట్టు శ్రీ‌ధర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పెద్దఎత్తున అవసరమయ్యే ఇసుక కోసం సమీపంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని గుర్తించామని తెలిపారు. ఈ ఇసుకను ఇక్కడే పూర్తిస్థాయిలో నిల్వ చేసి ఉంచాలని, ఇతరులు తరలించుకుపోకుండా సిఆర్‌డిఎ తన నియంత్రణలో ఉంచుకోవాలని సీఎం చంద్ర‌బాబు సూచించారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు జరపడం ద్వారా నదీ సామర్థ్యం కూడా పెంచుకునే వీలుందని జల వనరులశాఖ అధికారి సూచించగా, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని సీఎం సూచించారు. గ్రావెల్ కోసం సమీపంలో అనుకూలంగా ఉన్న కొండను తవ్వుకోవచ్చునని చెప్పారు. పెద్దఎత్తున అవసరమయ్యే సిమెంట్ కోసం రాజధానికి దగ్గరలోనే ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సిరామిక్ సిటీ ఏర్పాటు కోసం గుజరాత్ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇలా భవన నిర్మాణ సామాగ్రి తయారీ కోసం ఇక్కడే ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఇటుక తయారీ కోసం ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ నుంచి వచ్చే ఫ్లైయాష్‌ ను ఉపయోగించుకోవచ్చునని అధికారులు సూచించగా, స్థానికంగానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారినుంచే కొనుగోలు చేద్దామని ముఖ్యమంత్రి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/