Begin typing your search above and press return to search.

బాబు రివ్యూ ఏమో కానీ ఆకలి కేకలేనంట

By:  Tupaki Desk   |   5 Feb 2016 10:19 AM GMT
బాబు రివ్యూ ఏమో కానీ ఆకలి కేకలేనంట
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి కొన్ని విషయాలు అస్సలు పట్టవు. నిజానికి వారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వారికి అవసరమైన అన్నీ విషయాల్ని చూసుకోవటానికి మందీమార్బలం ఉంటుంది. వారికి మాదిరి అందరికి అలాంటి సౌకర్యం ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అడుగు తీసి అడుగు వేస్తుంటే.. అందుకు తగిన ఏర్పాట్లు వాటంతట అవే జరిగిపోతుంటాయి. అందుకే వారికి చాలా విషయాలు పట్టవు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంగతే చూసుకోండి. ఆయన రోజువారీగా తినేది చాలా చాలా తక్కువ. ఆయన డైట్ మొత్తం వింటే షాక్ తింటారు. చంద్రబాబు తినేది అంతేనా అనిపిస్తుంది. అంత కొద్దిగా తినే ఆయనకు సంబంధించి ఎప్పుడు ఏం తినాలో చెప్పేందుకు ఒకరుంటారు.

అలాంటి సౌకర్యం ఆయనతో భేటీ అయ్యేందుకు వచ్చే ఉన్నతాధికారులకు.. అధికారులకు అస్సలు ఉండదు. ఆ విషయాన్ని గుర్తించాల్సిన చంద్రబాబు.. అవేమీ పట్టకుండా వేళ కాని వేళలో రివ్యూలు పెట్టేయటం చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకూ ఏకధాటిగా రివ్యూలు సాగటం.. ఒకవేళ రాత్రి మొదలైతే అర్థరాత్రి వరకూ సాగటంతో అధికారులు ఆకలితో నకనకలాడిపోతన్న పరిస్థితి.

ఉన్నతాధికారుల్లో చాలామంది పెద్దవయస్కులు.. మధ్య వయస్కులు ఉంటారు. వారికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. అలాంటి వారికి సమయానికి కాస్తంత ఆహారం పడకపోతే పడకేసే పరిస్థితి. కానీ.. అలాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోని చంద్రబాబు.. తన ధోరణిలో తాను మాట్లాడుతూ ఉండిపోవటంతో అధికారులు నోరు మెదపలేని పరిస్థితి.

ముఖ్యమంత్రి నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే.. సార్.. ఆకలిగా ఉందని ఎవరు మాత్రం అనగలరు? అందుకే నోరు మూసుకొని వారు ఉండిపోతున్నారు. తీవ్రమైన ఆకలి బాధతో విలవిలలాడుతున్న పరిస్థితి. ఇకనైనా చంద్రబాబు తాను రివ్యూ చేసే సమయంలో.. ఎదుటోళ్ల ఆకలి గురించి కాస్త ఆలోచిస్తే మంచిదన్న మాట తరచూ వినిపిస్తోంది. కానీ.. ఈ విషయాన్ని ఆయన దాకా తీసుకెళ్లేవారు ఎవరుంటారు?