Begin typing your search above and press return to search.

శంకుస్థాపనతో టీడీపీకి ఒరిగిందేమిటి?

By:  Tupaki Desk   |   30 Oct 2015 6:23 AM GMT
శంకుస్థాపనతో టీడీపీకి ఒరిగిందేమిటి?
X
ఏపీలో టీడీపీకి నిద్రపట్టనివ్వని నిజం బటయపడింది. రాజధాని అమరావతికి .. శంకుస్థాపనకు ముందు ఎంతమేర ప్రచారం లభించిందో.. ఆ తర్వాత కూడా అంతేస్థాయిలో ట్రెండ్‌ ను కొనసాగిస్తూ ఉంది. వైభవోపేతంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన వేడుకల్ని గిన్నిస్‌ రికార్డుల్లోనూ ఎక్కించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా టీడీపీ సర్వే ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చినట్లు సమాచారం. పార్టీ పెద్దలు జీర్ణించుకోలేని స్థాయిలో ఈ వేడుకలకు సంబంధించి పాజిటివ్‌ మైలేజీ పెద్దగా రాకపోవడంతో అందరూ ఢీలా పడిపోయారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రభుత్వం తరఫున చేపట్టే ప్రతీ కార్యక్రమంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రజలతో పాటు పార్టీ కేడర్‌ తో కూడా వేర్వేరుగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ ఎస్‌) ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఆ మేరకు ఇటీవల అమరావతి శంకుస్థాపన వేడుకలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంతో పాటు కార్యక్రమంలో ఇతర విషయాలపై పాయింట్‌ ల వారీగా ఆరా తీసినప్పుడు .. మెజార్టీ అభిప్రాయం మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా లేదని తెలిసింది. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్‌ గా ఉన్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. తాజాగా, విజయవాడలో జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన ఈ విషయంపై స్పందించినట్లు తెలిసింది. అమరావతి శంకుస్థాపన వేడుకలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం అందరూ ఆసక్తిగా ఎదురుచూసినంతగా లేకపోవడం ఒక మైనస్‌ అయితే.. వేడుకల అనంతరం శిలాఫలకం - వేదిక ప్రొటోకాల్‌ విషయంలో సొంతపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం మరో మైనస్‌ గా మారిందని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది.

నిజానికి అమరావతి శంకుస్థాపనకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ విడుదలైన దగ్గర్నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రజలందరిలో ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ ఏర్పడింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై మోడీ ప్రకటన చేస్తారని.. ప్రత్యేకహోదా విషయంలోనూ స్పష్టత వస్తుందని అనేక అంచనాలు వెలువడ్డాయి. అయితే, మోడీ ప్రసంగం తర్వాత అందరి అంచనాలు తారుమారవడంతో ప్రజలంతా నీరుగారిపోయారు. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు ముసురుకుంటున్న నేపథ్యంలో , శంకుస్థాపన కార్యక్రమం జరిగిన విధానం, ప్రధాని ప్రసంగం తీరు ఎలా ఉందన్న విషయంపై ప్రభుత్వం ఆరాతీసే ప్రయత్నాల్లో పడింది. అమరావతి శంకుస్థాపన ఎలా జరిగింది..? ఏర్పాట్లు బాగున్నాయా..? ప్రధాని మోడీ ప్రసంగం ఎలా ఉంది..? ఏపీకి ప్రధాని న్యాయం చేశారని మీరనుకుంటున్నారా..? ప్రధాని భవిష్యత్‌ లో హామీలు నెరవేరుస్తారనే భరోసా ఉందా..? అనే ప్రశ్నలు సర్వేలో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా , ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదని విపక్షాల ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రధాని ప్రసంగంపై వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా భవిష్యత్‌ అడుగులేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రులెవరూ సీరియస్‌ గా తీసుకోలేదని .. తాను రేయింబవళ్లు ఆందోళనతో పనులు పర్యవేక్షించినా మిగతా మంత్రులు అంటీముట్టనట్టే వ్యవహరించారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. గుంటూరు - కృష్ణా జిల్లాల మంత్రుల ఇన్వాల్వ్‌ మెంట్‌ తక్కువగా ఉందని.. కేవలం మీడియాలో కనిపిస్తే సరన్నట్లుగా ఉన్నారని అధికారుల నుంచి నివేదిక వచ్చినట్లుతెలిసింది. దీనిపైనా చంద్రబాబు ఆగ్రహిస్తున్నారని సమాచారం.