Begin typing your search above and press return to search.

బాబుకు - అధికారులకు మధ్య గ్యాప్

By:  Tupaki Desk   |   29 Jan 2019 8:57 AM GMT
బాబుకు - అధికారులకు మధ్య గ్యాప్
X
ఏపీలో కొత్త లొల్లి మొదలైంది. చంద్రబాబుకు ఐఏఎస్ లకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికార బలంతో చంద్రబాబు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను అధికారులు వ్యతిరేకిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు వైఖరి చూసి ఐఏఎస్ లంతా విస్తుపోయారు. తన ఆదేశాలను కూడా ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది.

ఏపీ కేబినెట్ ఇటీవలే చుక్కల భూముల సమస్యలపై పలు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాల్లో లొసుగులున్నాయని అధికారులు అమలు చేయలేదు. దీంతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డి. సాంబశివరావు పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. మంత్రులు - కలెక్టర్లు - ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో లైవ్ లో ఉండగానే.. ‘చుక్కల భూములతో తనకే చుక్కలు చూపిస్తున్నారంటూ’ అధికారుల తీరును బాబు ఎండగట్టారు.

ఈ నేపథ్యంలోనే బాబు విమర్శలకు స్పందించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డి. సాంబశివరావు.. ‘మీరు ఆదేశాలిచ్చారు కానీ నిబంధనల (రూల్ బుక్) నుంచి వాటిని తొలగించలేదు. దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడతాం.. అందుకే అమలు చేయలేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. జీవోనెం. 12ద్వారా ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తోందని.. ఇప్పటికైనా 22ఏ జాబితాలోంచి తొలగిస్తేనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగుతుందని ఏపీ సీఎంకు సాంబశివరావు స్పష్టం చేశారు.

సాంబశివరావు సమాధానంకు బాబు ఫైర్ అయ్యారు.. ‘సీనియర్ అధికారి అయిన మీకు ఏ పని చేయరావడం లేదు. మీరు గుంటూరు కలెక్టర్ దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో సాంబశివరావు సహా ఉన్నతాధికారులంతా అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్ అనుసరించిన విధానాన్నే మిగిలి కలెక్టర్లు, ఉన్నతాధికారులు అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక సమస్యలతో చుక్కల భూములకు అడ్డుపడవద్దని సూచించారు.

కాగా రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సాంబశివరావుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్య్తక్తం చేయడాన్ని పలువురు ఐఏఎస్ లు, ఉన్నతాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. లైవ్ లో చూసిన సీనియర్ ఐఏఎస్ లు ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ సాంబశివరావుపై బాబు పరుష వ్యాఖ్యలు చేయడాన్ని సీనియర్ అధికారులంతా ముక్తకంఠంతో ఖండించి సంఘీభావం తెలిపారని తెలుస్తోంది. నిన్నటి వీడియో కాన్ఫరెన్స్ తో బాబుకు.. ఐఏఎస్ లకు దూరం పెరిగిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.