Begin typing your search above and press return to search.

బాబు నిరుద్యోగ భృతి నిబంధనలు తెలుసా..?

By:  Tupaki Desk   |   16 March 2017 9:49 AM GMT
బాబు నిరుద్యోగ భృతి నిబంధనలు తెలుసా..?
X
నిరుద్యోగుల‌కు 2000 రూపాయ‌ల మేర భృతి ఇస్తాన‌ని ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇన్నాళ్లకు మళ్లీ దాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. అయితే... నిరుద్యోగ భృతి కోసం పెడుతున్న నిబంధనలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా బడ్జెట్లో నిరుద్యోగుల భృతికి రూ.500 కోట్లు కేటాయించారు. యువజన సంక్షేమ శాఖ నుంచి ఆ మొత్తం ఇస్తారు. దీంతో నెలలకు కనీసం రూ.1000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నది యోచన. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దీనికి అర్హత పొందాలంటే నిరుద్యోగులు ఏం చేయాలన్న దగ్గరే అసలు చిక్కుముడి ఉంది. వెయ్యి రూపాయల భృతి కోసం రూ.10 వేల విలువైన పనులు చేయించుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. దీంతో ఇంకా ఈ పథకం మొదలుపెట్టకముందే మాకు అదేమీ అవసరం లేదంటోంది నిరుద్యోగ యువత.

రూ.1000 నిరుద్యోగ భృతి కావాలంటే అక్షరాస్యత వృద్ధి - పారిశుద్ధ్యం - మొక్కల పెంపకం వంటి సామాజిక బాధ్యతలన్నీ చూడాలట. ఇది మంచి ఉద్దేశమే.. సమాజానికి పనికొచ్చేదే కానీ. ఇన్ని చేయించుకుని రూ. వెయ్యి ఇవ్వడమన్నదే హాస్యాస్పదమంటున్నారు నిరుద్యోగ యువత. పాఠశాలలు.. ఇతర వ్యవస్థలు ఉన్నప్పుడు నిరుద్యోగ భృతిని అడ్డంపెట్టుకుని విద్యావృద్ధికి తమతో పనిచేయించుకోవడం ఏమిటంటున్నారు.

ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తే.. అలాంటి ఉద్యోగమే ఎక్కడైనా ఉంటే.. అందుకు రూ.10 వేలు అంతకంటే ఎక్కువ జీతమే వస్తుందని.. కానీ.. రూ.వెయ్యికే తమతో ఆ పనులన్నీ చేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని యువత అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/