Begin typing your search above and press return to search.

థ్యాంక్సేనా?.. మోడీకి నిరసన చెప్పేదెప్పుడు బాబు?

By:  Tupaki Desk   |   14 Sep 2016 3:15 AM GMT
థ్యాంక్సేనా?.. మోడీకి నిరసన చెప్పేదెప్పుడు బాబు?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇస్తామంటూ ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తానెంత సంతోషంగా ఉందన్న విషయాన్ని ఒక మాటతో చెప్పకనే చెప్పేశారు. తాజాగా పోలవరం ప్రాజెక్టును హెలికాఫ్టర్ ద్వారా వీక్షించిన బాబు.. అనంతరం ఆ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోడీకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకూ అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపినట్లుగా చెప్పారు. ఫోన్ లో మాట్లాడిన సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తాన్ని ఐదేళ్ల వ్యవధిలో తాను అందించనున్నట్లుగా తనతో ప్రధాని మోడీ చెప్పారన్నారు.

బాబుకు మోడీ ఏం చెప్పారన్నది పక్కన పెడితే.. పోలవరం మీద కేంద్రం తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు.. ప్రత్యక హోదా ఇవ్వని దానికి మోడీకి తన నిరసన తెలిపారా? లేదా? అన్నది ప్రశ్న. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు చెబితే బాగుంటుంది. విభజన హామీల్లో ఇప్పటివరకూ అమలు కాని అంశాలెన్నో ఉన్నాయి. మరి.. వాటికి సంబంధించి ప్రధానిని నిలదీయకపోయినా.. కనీసం తన అసంతృప్తినైనా చంద్రబాబు వ్యక్తం చేశారా? లేదా? థ్యాంక్స్ చెప్పినట్లే.. ఏపీ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నది బాబు మర్చిపోకూడదు.