Begin typing your search above and press return to search.

బాబుకు ఎందుకు భయం...!!!

By:  Tupaki Desk   |   21 Aug 2018 4:29 AM GMT
బాబుకు ఎందుకు భయం...!!!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. అవును.... ఇదే మాటను ఆంధ్రప్రదేశ్ ప్రజలు లోలోపల అనుకుంటున్నారు. వాళ్లే కాదు.... తెలంగాణ - తమిళనాడు - కర్నాటక.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా అనుకుంటున్నారు. ఎదుటి వారిని తన మాటలతో - రాజకీయ వ్యూహాలతో - వేలు చూపిస్తూ బెదిరింపులు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారంటే అందరికీ ఆశ్యర్యంగానే ఉంది. ఇంతకీ ఆయన భయపడడానికి కారణం ఏమిటా అనుకుంటున్నారా...!! ఏమీ లేదు... ముందస్తు ఎన్నికలే చంద్రబాబు నాయుడి ‍భయానికి కారణం అంటున్నారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ - పొరుగున ఉన్న తెలంగాణలోనూ కూడా ముందస్తుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తెలంగాణలో అయితే ఆ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ శ్రేణులకు ముందస్తు గురించి చెప్పడమే కాదు... బహిరంగంగా కూడా ప్రకటించారు. ఆయన కంటే సీనియర్ - ఆ మాటకొస్తే దేశంలోనే సీనియర్ నాయకుడినే తానే అని చెబుతున్న చంద్రబాబు నాయుడు ముందస్తుకు ఎందుకు భయపడుతున్నారని అందరికీ సందేహంగా ఉంది. దీనికి కారణం ఆయనే. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేశారు. ఆ దాడికి ముందు ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తనపై జరిగిన దాడిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు. అంతే అనుకున్నదే తడవుగా శాసనసభను రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తనపై అలిపిరిలో జరిగిన సమయంలో తాను గాయపడిన - రక్తమోడుతున్న పెద్ద పెద్ద ఫొటోలను సమైక్య రాష్ట్రం గోడలపై నింపేశారు. ఆ ఫొటోలు చూపిన వారంతా తనకు అండగా ఉంటారని - సానుభూతి వెల్లువలా వచ్చి పడుతుందని ఆయన ఆశించారు. తెలుగు ప్రజలు ఎంత తెలివైన వారో ఆ ఎన్నికల్లో రుజువైంది. అలిపిరిలో జరిగిన దాడిని ప్రజలు తీవ్ర స్ధాయిలో వ్యతిరేకించారు. దాడి అనంతరం జరిగిన ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓటమి పాలయ్యారు. అధికారం కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి వెనుక నిలబడ్డారు. ఆయనకు ఘనమైన మెజార్టీనిచ్చి అధికారాన్ని కట్టపెట్టారు. అంతే చంద్రబాబు నాయుడికి తనపై ప్రజలకు సానుభూతి లేదని బయటపడింది. ఇదే భయం ఇప్పుడు చంద్రబాబునాయుడ్ని వేధిస్తోంది.

ఇప్పుడు మళ్లీ ముందస్తుకు వెళ్తే తనకు కలిసి రాదని - ఉన్నన్ని నాళ్లు ఈ అధికారాన్ని అనుభవించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కనపడుతోంది. ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు నాయుడు మిగిలిన సమయంలో అనుభవించాలనుకుంటున్నారని తెలుగు వారు అంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడి భయానికి కారణమని వారంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడికి ముందస్తు ఎన్నికల భయం వెంటాడుతోంది.