Begin typing your search above and press return to search.

చంద్రబాబును భయపెడుతున్న మరాఠా మూమెంట్

By:  Tupaki Desk   |   31 July 2018 2:30 PM GMT
చంద్రబాబును భయపెడుతున్న మరాఠా మూమెంట్
X
తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్రలో ఉదృతంగా సాగుతున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమం ఏపీ సీఎం చంద్రబాబును భయపెడుతోంది. ఏపీలోనూ కాపుల రిజర్వేషన్ అంశం నివురుగప్పిన నిప్పులా ఉండడంతో ఎప్పుడు అది భగ్గుమంటుందో... దానికి మరాఠా ఉద్యమం ఎలాంటి ప్రేరణనిస్తుందో అని ఆయన టెన్షన్ పడుతున్నారు.

విద్య - ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు 16 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మరాఠాలు మహారాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు - రాస్తారోకోలు ఆందోళనలు చేస్తున్నారు. పుణెలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారుల దాడిలో 50 వాహనాలు కాలిబూడిదైపోగా..40 ఆర్టీసి బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు పూణలో 144 సెక్షన్‌ విధించారు. ఆందోళన కారుల్ని కట్టడి చేసేందుకు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరోవైపు రిజర్వేషన్ల కోసం మరాఠాలు ఏకం కావాలంటూ ఔరంగాబాద్‌ లో ప్రమోద్‌ సింగ్‌ అనే యువకుడు కదులుతున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుుకున్నాడు.

విద్యా - ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ పై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కొన్ని రోజులుగా మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. రిజర్వేషన్ల కోసం పలువురు ఆత్మహత్యలకు పాల్పడటంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. కొన్ని రోజుల క్రితం నాందేడ్‌లోనూ ఓ వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక ఏపీ విషయానికొస్తే కాపుల రిజర్వేషన్ విషయంలో చంద్రబాబుపై ఆ సామాజికివర్గానికి పీకల్దాక కోపముంది. కానీ... ఇటీవల రిజర్వేషన్ల విషయంలో సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఆచరణ సాధ్యం కాని హామీలు తాను ఇవ్వలేని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో దాన్ని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది. అయితే.. ఇదేసమయంలో మరాఠాల రిజర్వేషన్ల పోరు ఏపీ కాపుల్లో చాలామందిని ప్రభావితం చేస్తోందని.. తామూ అలా ఉద్యమం చేస్తే మంచిదన్న భావన పలువురు కాపు నేతలు - మేధావుల నుంచి వ్యక్తమవుతోందని ఇంటిలిజెన్సు వర్గాలు చంద్రబాబుకు తెలిపినట్లు సమాచారం. దీంతో.. ఇక్కడా అలాంటి ఉద్యమం రావొచ్చని.. వస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు అసాధ్యమని చంద్రబాబు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.