Begin typing your search above and press return to search.

తెదేపా బహిరంగ సభ డౌటే!

By:  Tupaki Desk   |   4 Aug 2017 5:22 AM GMT
తెదేపా బహిరంగ సభ డౌటే!
X
సాధారణంగా ఎన్నికలు అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటుంది. ఒకేసారి ఎక్కువమంది ప్రజలకు తమ ఎన్నికల ప్రచార విధివిధానాలను తెలియజేయడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులకు బెంబేలెత్తించేలా.. తమ బలనిరూపణ చేసుకోవడానికి కూడా బహిరంగసభలు ఒక మార్గం అని పార్టీలు భావిస్తాయి. సాధారణ ఎన్నికల్లో అయితే.. కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లోనే ఇలాంటివి జరుగుతాయి. ఉపఎన్నికలైతే ఖచ్చితంగానూ జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక లో తెదేపా బహిరంగసభ నిర్వహించడం అనేది డౌటుగా మారుతోంది. గురువారం జగన్ సభ జరిగిన తీరు, దానికి వచ్చిన ప్రజాస్పందన గమనించిన తరువాత.. అంతకు మించి జనసమీకరణ చేయడంలో తాము ఫెయిల్ అయితే గనుక.. పరిస్థితి దారుణంగా ఉంటుందని వారు భయపడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ శిల్పా మోహన్ రెడ్డి తరఫున జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. అసంఖ్యాకంగా జనం రావడంతో వైకాపా శ్రేణుల్లో అప్పుడే గెలిచిపోయినంత ఆనందం వ్యక్తం అవుతోంది. ఈ సభకు వచ్చిన స్పందనే తెదేపాలో భయంగా కూడా మారుతోంది.

నిజానికి తెలుగుదేశం తరఫున ఇప్పటికే ఒక బహిరంగ సభ లాంటిది నిర్వహించేశారు. కాకపోతే అది అధికారిక ప్రభుత్వ కార్యక్రమం. లబ్దిదారుల పేరిట జనాన్ని ప్రభుత్వ ఖర్చుతో తరలించి.. సదరు సభను చంద్రబాబునాయుడు దాదాపుగా ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. కాకపోతే.. అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు గనుక.. తృటిలో ఉల్లంఘనల కేసును తప్పించుకున్నారు. ఆ రకంగా అనైతిక ప్రచారాన్ని ఎప్పుడో ముగించారు. కానీ చంద్రబాబునాయుడు నిర్వహించిన సభకు, జగన్ సభకు ఏమాత్రం పొంతనే లేదు. జగన్ సభ కు ఈ రేంజిలో జనం వచ్చిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో పార్టీ ఒక సభ నిర్వహించినా ఇంతమందిని సమీకరించడం కష్టం అని.. తమకు జనాదరణ లేదనే సంగతి స్పష్టంగా బయటపడిపోతుందని.. దానికంటె బహిరంగ సభ జోలికి వెళ్లకుండా ప్రచారం చేసుకోవడమే మేలని తెదేపా శ్రేణులు భావిస్తున్నాయట. పైగా జగన్ సభలో చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా ఎంచి రాజీనామా చేసేసిన తర్వాత, ఇప్పుడు తెదేపా సభ నిర్వహిస్తే.. వైకాపా నుంచి ఫిరాయించిన నేతల సరసనే కూర్చుని మాట్లాడాల్సి వస్తుందని ఇదంతా పరువు నష్టం కలిగిస్తుందని దాని బదులుగా తాము బహిరంగసభ జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెదేపా నాయకులు తమలో తాము అనుకుంటున్నారట.