Begin typing your search above and press return to search.

రాజమండ్రి ఎంపీ సీట్ ఆయనకేనా?

By:  Tupaki Desk   |   4 March 2019 2:28 PM GMT
రాజమండ్రి ఎంపీ సీట్ ఆయనకేనా?
X
ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా ఒకేసారి జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏపీలో పొలిటిక‌ల్ హీట్ ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింద‌ని చెప్పాలి. ఈ హీట్‌ కు అనుగుణంగానే ఇటు అధికార టీడీపీతో పాటు అటు విప‌క్ష వైసీపీ కూడా త‌మ‌దైన శైలి వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నాయి. ఇలాంటి కీల‌క త‌రుణంలో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇప్పుడు ఎన్న‌డూ ఎదురు కాని ఓ వింత ప‌రిస్థితి ఎదురైపోయింది. అదేంటంటే.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సెంటిమెంట్ జిల్లాగా పేరున్న తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క స్థానం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పార్ల‌మెంటు నుంచి బ‌రిలోకి దిగేందుకు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ముందుకు రావ‌ట్లేద‌ట‌. సాధార‌ణంగా ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు ద‌క్కించుకున్న పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుంద‌ని అనాదిగా ఓ సెంటిమెంట్ ఉంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. దీంతో ఈ సారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ ఈ జిల్లాపై మంచి ఆశలే పెట్టుకుంది.

అయితే రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌ - పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న సినీ న‌టుడు మాగంటి ముర‌ళీ మోహన్‌.. ఈ ద‌ఫా తాను పోటీ చేయ‌బోన‌ని ప్ర‌క‌టించేశారు. అంతేకాకుండా త‌న రాజ‌కీయ వార‌సురాలిగా ఇటీవ‌లే ఎంట్రీ ఇచ్చిన త‌న కోడలు రూప కూడా ఈ సారి పోటీ చేయ‌డం లేద‌ని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఓడిపోతామ‌న్న భ‌య‌మో? లేక మ‌రేమిటో? తెలియ‌దు గానీ... ముర‌ళీ మోహ‌న్ నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌క‌ట‌న పార్టీలో పెను సంచ‌ల‌నంగా మారిపోయింది. ఎన్నిక‌ల‌కు ఇంకా ఎంతో స‌మ‌యం లేని నేప‌థ్యంలో మాగంటి నుంచి ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న రాగానే... షాక్‌ కు గురైన చంద్ర‌బాబు ప్ర‌త్యామ్నాయాల‌ను ప‌రిశీలించారు. పార్టీలో సీనియ‌ర్‌గానే కాకుండా రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రితో పాటు పార్టీకి చెందిన మ‌రో కీల‌క నేత‌ - మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్క‌ర‌రామారావు - మ‌రో కీల‌క నేత అవంతి ఇంద్ర‌కుమార్‌ ల‌ను కూడా చంద్ర‌బాబు అడిగార‌ట‌. రాజ‌మండ్రి బ‌రిలోకి దిగుతారా? అంటూ చంద్ర‌బాబు అడిగితే... అబ్బే త‌మతో కాద‌ని వారు ముఖం మీదే చెప్పేశార‌ట‌.

మ‌రేం చేయాలి? రాజ‌మండ్రి నుంచి పోటీ చేయ‌డం లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌లేరు క‌దా. మ‌రేం చేయాలి? కొత్త నేత‌ను రంగంలోకి దించాలి. ఇలా రాజ‌మండ్రిలో గెలుపు - ఓట‌మి అన్న విష‌యంపై ఏమాత్రం ఆలోచించ‌కుండా బ‌రిలోకి దిగే నేత ఎవ‌రున్నారు? అన్న కోణంలో ఆలోచించిన చంద్ర‌బాబుకు గ‌తంలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ జాస్తి మూర్తి క‌నిపించార‌ట‌. రివ‌ర్ బే మూర్తిగా జిల్లా జ‌నాల‌కు బాగానే ప‌రిచయం ఉన్న జాస్తి మూర్తిని రంగంలోకి దించ‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న కూడా స్థానిక తెలుగు త‌మ్ముళ్ల నుంచి వినిపిస్తోందట‌. దీంతో జాస్తి మూర్తిని రంగంలోకి దించే దిశ‌గా చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి జాస్తి మూర్తి అయినా టీడీపీ రాజ‌మండ్రి ఎంపీ సీటును తీసుకుంటారో? లేక మాగంటి అండ్ కో మాదిరి త‌న‌తో కూడా కాద‌ని తేల్చేస్తారో చూడాలి.

ఎస్ ఆర్ కే...