Begin typing your search above and press return to search.

పార్క్ హ‌య‌త్‌ లో రాహుల్‌-బాబు చ‌ర్చ‌లు

By:  Tupaki Desk   |   29 Nov 2018 6:33 AM GMT
పార్క్ హ‌య‌త్‌ లో రాహుల్‌-బాబు చ‌ర్చ‌లు
X
కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ - టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుల రాక‌తో తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ఒక్క‌సారిగా వేడెక్కింది. టీఆర్ ఎస్‌ ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా వారిద్ద‌రూ క‌లిసి బుధ‌వారం ప‌లు రోడ్ షోలు - బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌జా కూట‌మిని గెలిపించాలంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. గురువారం కూడా ఈ ఇద్ద‌రు నేత‌లు ప‌లు రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో గురువారం ఉద‌య‌మే రాహుల్ - చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌ లో భేటీ కావ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌పై చ‌ర్చ కోసం చంద్ర‌బాబే ఈ బ్రేక్ ఫాస్ట్‌ స‌మావేశానికి రాహుల్‌ ను ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. త‌న షెడ్యూల్ చాలా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ప్రాధాన్యాన్ని గుర్తించిన రాహుల్‌.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను కాసేపు ప‌క్క‌న పెట్టి మ‌రీ హోట‌ల్‌ కు వెళ్లిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఈ భేటీలో రాహుల్‌ - చంద్ర‌బాబు చ‌ర్చించార‌ట‌. అంతేకాదు - తెలంగాణ ఎన్నిక‌ల అనంత‌రం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన ప్ర‌ణాళిక‌లు కూడా వారి స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ట‌. బీజేపీకి వ్య‌తిరేకంగా కేంద్ర స్థాయిలో ఏయే పార్టీల‌ను క‌లుపుకుపోవాలి? క‌మ‌ల‌నాథుల వ్యూహాల‌ను ఎలా చిత్తు చేయాలి? అనే అంశాల‌ను వారు చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. దీన్ని బ‌ట్టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ - టీడీపీల పొత్తు ఖాయ‌మ‌ని అర్థం చేసుకోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. బిజీ షెడ్యూల్‌ ను ప‌క్క‌న పెట్టి మ‌రీ చంద్ర‌బాబుతో భేటీకి రాహుల్ వెళ్ల‌డం.. బాబుకు ఆయ‌న ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.