Begin typing your search above and press return to search.

జగన్ కు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చిన చంద్రబాబు.. ఇదెక్కడి లెక్క?

By:  Tupaki Desk   |   3 Aug 2020 4:54 PM GMT
జగన్ కు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చిన చంద్రబాబు.. ఇదెక్కడి లెక్క?
X
చిత్రవిచిత్రంగా వ్యవహరించటం.. అనూహ్యమైన వ్యాఖ్యలు చేయటం.. విన్నంతనే కడుపుబ్బా నవ్వు వచ్చేలా టార్గెట్లు విధించటం వగైరా..వగైరా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా అలవాటు. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవాలంటే.. తనకు తానుగా తీసుకోవాలే తప్పించి.. ఎవరినో బెదిరించటం.. మీకు టైమిస్తున్నా.. అంటూ బడాయి మాటలు మాట్లాడటంలో బాబు ఉద్దేశం ఏమిటో అర్థం కానే కాదు.
ఏపీకి ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అన్న నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఎన్నుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం తీరు చంద్రబాబుకు ఒక పట్టాన మింగుడుపడటం లేదు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం ఎవరికి లేదనే ఆయన.. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని.. ఐదు కోట్ల ప్రజలదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఏపీలో మూడు రాజధానుల్నిఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన ఆయన.. ఎన్నికల ముందు రాజధాని గురించి చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారన్నారు. పవర్లోకి వచ్చాక మూడు రాజధానులు చేస్తామనటం సరికాదన్నారు. ఎలా మోసం చేశారో ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలన్న బాబు మాట చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఆక్రోశమంతా దేని కోసమో. ఒకవేళ జగన్ కానీ మోసం చేసి ఉంటే.. ఐదు కోట్ల ఆంధ్రులు రగిలిపోయేవారు కదా? అందుకు భిన్నంగా ప్రజలంతా అర్థం చేసుకోవాలన్న మాట చెప్పాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.

మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమే అని భావిస్తే అందరం రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళదామని సవాలు విసరుతున్న చంద్రబాబు.. గతంలో జగన్ సవాలు విసిరిన ఏ సమయంలో అయినా స్పందించారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. తాను 48 గంటల సమయం ఇస్తున్నానని.. అసెంబ్లీని రద్దు చేయాలని.. రాజీనామాలు చేయటానికి టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజీనామాలు చేసి ప్రజల్లో రావాలని.. తేల్చుకుందామన్నారు. జగన్ కానీ రెండు రోజుల్లో స్పందించకుంటే తాను మళ్లీ మీడియా ముందుకు వస్తానని చెప్పారు. బాబు మాటల్ని చూస్తుంటే.. వయసు మీద పడిన తర్వాత తన మాటల మీద తన పట్టును కోల్పోయిన భావన కలుగక మానదు. అయినా.. రాజీనామాలు చేయాలంటే చేయాలే తప్పించి.. మీరు వచ్చి రాజీనామాలు చేస్తే.. మేము కూడా అన్నట్లుగా ఉన్న బాబు మాటల్ని చూస్తే.. ఆయన మాటల్లో మర్మం ఏమిటో అర్థం కాక మానదు.అయినా.. ప్రభుత్వం నిర్ణయం నచ్చక పోతే.. నచ్చలేదని చెప్పి.. పదవులకు రాజీమాలు చేసి పారేసి ఉప ఎన్నికలకు వెళ్లాలే కానీ ఇలా అల్టిమేటం ఇవ్వటం ఏమిటో?