Begin typing your search above and press return to search.

పాలన లోకేశ్ కు... పార్టీ చంద్రబాబుకు?

By:  Tupaki Desk   |   22 April 2017 5:20 AM GMT
పాలన లోకేశ్ కు... పార్టీ చంద్రబాబుకు?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పాలన పగ్గాలు మెల్లమెల్లగా కుమారుడు లోకేశ్ కు అప్పగించి... తాను పార్టీ వ్యవహారాలు - జాతీయ స్థాయి రాజకీయాలను చూసుకునేలా చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన ఏపీ మంత్రివర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి.

నిన్నమొన్నటి వరకు లోకేశ్ పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు. అయితే, ఆయన ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. ఆయనతో పాటు ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళావెంకటరావు కూడా మంత్రయ్యారు. దీంతో పార్టీ పనులు చూసుకోవడానికి ఎవరూ ప్రత్యేకంగా లేరు. ఇదే సమయంలో దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అసంతృప్తులు - ఆగ్రహాలు అధికమవుతున్నాయి. కొత్తగా వచ్చిన నేతలు - పాత నేతలు మధ్య వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి తరునంలో వెంటనే కట్టడి చేయకపోతే పార్టీలో క్రమశిక్షణ తప్పే ప్రమాదం ఉంది. దాంతో చంద్రబాబే స్వయంగా పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని డిసైడయ్యారట.

నారా లోకేష్ - కళా వెంకట్రావులు మంత్రులుగా బాధ్యతలను స్వీకరించడంతో... పాలనా వ్యవహారాల్లో వారు బిజీ అయిపోయారని చంద్రబాబు అనడం వెనుక ఉద్దేశం అదే అని తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇకపై తానే చూసుకుంటానని మంత్రివర్గంలో చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రెండు మూడు గంటల సేపు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని తెలిపారు. వారంలో కనీసం ఐదు రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మరోవైపు కీలక బాధ్యతలు ఒక్కొక్కటిగా లోకేశ్ కు అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లోకేశ్ కు పాలన పై పట్టు చిక్కితే భవిష్యత్ లో పార్టీ గెలిచిన పక్షంలో ఆయన్ను సీఎంగా చేసి చంద్రబాబు పార్టీ వ్యవహారాలు - జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/