Begin typing your search above and press return to search.

కొడాలి నానికి షాకిచ్చేలా చంద్రవ్యూహం...?

By:  Tupaki Desk   |   14 Feb 2022 11:30 AM GMT
కొడాలి నానికి షాకిచ్చేలా చంద్రవ్యూహం...?
X
ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న సూత్రాన్ని అనుసరించి వైసీపీ చంద్రబాబు మీదకు కొడాలి నానికి ప్రయోగిస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టీడీపీ సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంతో పాటు ఆ వర్గానికి బాబును దూరం చేయాలన్నది దీని వెనక మాస్టర్ ప్లాన్. అయితే ఈ విషయంలో వైసీపీ మంత్రి కొడాలి నాని చాలా దూకుడుగానే వెళ్లారు. అగ్రెస్సివ్ గానే చంద్రబాబుని టార్గెట్ చేశారు.

ఒక దశలో చంద్రబాబే కాదు, ఏపీలోని జనాలు కూడా ఇదేమిటి అని ఆలోచించుకునేలా హాట్ హాట్ కామెంట్స్ నాని చేశారు. దాంతో వైసీపీ వ్యూహం బెడిసికొట్టినట్లు అయింది. బాబు ఫ్యామిలీని కూడా వదలక పూర్తిగా వ్యక్తిగతానికి దిగిపోయి నాని చేసిన కామెంట్స్ చాలా సార్లు బూమరాంగ్ అయ్యాయి. దాంతో బాబుకు సానుభూతి బాగా వచ్చింది.

ఇక మరో వైపు వైసెపీ పాలన మూడేళ్ళకు దగ్గర పడడంతో కూడా నెగిటివిటే పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఈ సంక్రాంతికి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో కాసినో గేమ్స్ జరిపించారని బలమైన ఆరోపణలను టీడీపీ చేసింది ఆ విధంగా కొంత పొలిటికల్ మైలేజ్ అయితే సంపాదించుకుంది. ఇక నానికి కూడా ఎంతో కొంత డిఫెన్స్ లో పడేసింది.

ఇవన్నీ పక్కన పెడితే 2024లో కొడాలి నానిని మాజీని చేయాలన్నదే టీడీపీ బిగ్ బాస్ పంతంగా అంటున్నారు. నాని తనను దారుణంగా టార్గెట్ చేయడంతో బాబు ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అసెంబ్లీకి రాకూడదు అని శపధమే చేస్తున్నారుట. దాని కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బీలను కూడా రెడీ చేసి పెట్టుకున్నారని టాక్.

ప్లాన్ ఏ తీసుకుంటే నానికి సులువుగా ఓడించేందుకు ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ సాయం కూడా తీసుకోవాలనుకుంటున్నారుట. 2019 ఎన్నికల్లో గుడివాడలో నాని మీద టీడీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తే ఆయనకు 70 వేల దాకా ఓట్లు వచ్చాయి. నానికి 89వేల 833 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు ఇరవై వేల ఓట్ల తేడాతో నాని గెలిచారు. నానికి గుడివాడలో పట్టుంది. ఇప్పటికి నాలుగు సార్లు గెలిచారు. అక్కడ ఉన్న వివిధ సామాజిక వర్గాల అండదండలు కూడా ఆయనకు ఉన్నాయి.

అందుకే ఈసారి గట్టి క్యాండిడేంట్ ని సామాజిక సమీకరణల కోణంలో కూడా ఎంపిక చేసి పెడితే నాని ఓటమి డ్యామ్ ష్యూర్ అని బాబు భావిస్తున్నారుట. దాని కోసం ఆయన అన్ని రకాల సర్వేలను జరుపుతూనే మరో వైపు 2019 నాటి ఫలితాలను కూడా సమీక్షిస్తున్నారుట. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్ధికి 75 వేల ఓట్లు వచ్చాయి. ఇక ఒంటరిగా నాడు పోటీ చేసిన జనసేన అభ్యర్ధికి పది వేల దాకా ఓట్లు వచ్చాయి. ఇక్కడ కమ్మల ఓట్లు కేవలం 14 వేలు మాత్రమే ఉంటే, కాపుల ఓట్లు ముప్పయి వేల దాకా ఉన్నారు.

వారిలో అత్యధికులు 2019లో వైసీపీకి వేయడం వలనే నాని గెలుపు సాధ్యమైంది. అందుకే ఈసారి జనసేన మద్దతు తీసుకుని గట్టి క్యాండిడేట్ ని దింపితే మాత్రం కచ్చితంగా నాని ఇంటికి వెళ్ళడం ఖాయమని బాబు ఆలోచిస్తున్నారుట. ఇది ప్లాన్ ఏ గా చెబుతున్నారు. మరి ప్లాన్ బీ ఏంటి అంటే అది కూడా ఇంటెరెస్టింగ్ గానే ఉంది మరి.

ప్లాన్ బీ ప్రకారం జనసేనతో పొత్తులు లేకపోతే ఏకంగా నందమూరి కుటుంబం నుంచి బిగ్ ఫిగర్ ని తెచ్చి నాని మీద పోటీకి పెడతారుట. ఆ క్యాండిడేట్ ఎవరో కాదు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ. నానికి ఎన్టీయార్ ఫ్యామిలీ అంటే అభిమానం ఉంది. వారిని ఏమీ ఇప్పటిదాకా అనలేదు. అయితే తాజాగా చంద్రబాబు కుటుంబం మీద కొడాలి నాని, ఆయన సన్నిహితుడు వల్లభనేని వంశీ చేసిన కొన్ని అనుచిత కామెంట్స్ తో నందమూరి ఫ్యామిలీ మంటెత్తిపోయి ఉంది.

దాంతో బాలయ్యను గుడివాడ నుంచి పోటీకి దించితే యావత్తు అన్నగారి ఫ్యామిలీ కసి మీద పనిచేస్తుందని అంచనాలో టీడీపీ ఉంది. అంతే కాదు ఎన్టీయార్ రెండుసార్లు గెలిచిన సీటు, ఆయన పుట్టిన నిమ్మకూరు కూడా అక్కడే ఉంది కాబట్టి నానికి ఓడించడం డెడ్ ఈజీ అని లెక్కలు వేసుకుంటోంది. అయితే దీనికి బాలయ్య అంగీకరించాలి.

ఆయన హిందూపురంలో ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఆయన హ్యాపీగా ఉన్నారు. మూడవసారి పోటీ చేసినా ఆయన విజయం ఖాయమని అంటున్నారు. మరి అలాంటి సీటుని వదిలేసి హోరా హోరీ పోటీకి ఆయన రెడీ అవుతారా అన్నదే ఇక్కడ చర్చ. ఒక వేళ నందమూరి ఫ్యామిలీ మొత్తం డిసైడ్ చేస్తే బాలయ్య ఓకే అనక తప్పదు. అదే జరిగితే నాని వర్సెస్ నందమూరి ప్లస్ నారా అంటే ఏపీ మొత్తం చూడాల్సిన వెరీ హాటెస్ట్ సీటు అదే అవుతుంది.