Begin typing your search above and press return to search.

దోమలపై వార్ ఏమో కానీ బాబుకు షాక్!!

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:36 AM GMT
దోమలపై వార్ ఏమో కానీ బాబుకు షాక్!!
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఎదురైంది. తానెంత ఉత్సాహంగా ఉన్నా సరిపోదని.. తనతో కలిసి నడిచే నేతల్లో ఉత్సాహాన్ని రగిలించటం.. అధికారుల్లో స్పూర్తిని నింపకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం బాబుకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. దోమలపై సమరం అంటే.. పరీక్షల మద్యలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చి మరీ ‘వార్’ షురూ చేసిన ఎపిసోడ్ కు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైందని చెబుతున్నారు.

దోమల దండయాత్ర పేరిట శనివారం ఏపీవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించి మరీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బాబు ప్లాన్ చేయటం తెలిసిందే. తాను సైతం ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు వీలుగా ఏలురుకు వచ్చారు. తొలుత సీఆర్ రెడ్డి కాలేజీ మైదానం నుంచి నగరంలోని సురేష్ బహుగుణ పోలీస్ రిజర్వ్ స్కూల్ వరకు ర్యాలీగా వచ్చిన చంద్రబాబు.. తర్వాత పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ సీన్ చూసిన వెంటనే బాబుకు షాక్ తగిలినంత పనైంది. తన లాంటి అధినేత వస్తున్నారంటే కిక్కిరిపోయి ఉండాల్సిన ప్రాంగణం.. అందుకు భిన్నంగా వందల మంది మాత్రమే ఉండటం..సభా స్థలి మొత్తం పలుచ‌గా.. ఖాళీగా ఉండటంపై ఆయన సీరియస్ అయ్యారు.

నేతలు.. అధికారుల మధ్య లోపించిన సమన్వయంతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. దోమల సమరం కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు సెలవు ఇచ్చింది దోమలపై అవగాహన పెంచటానికే కానీ ఇంట్లో ఉండటానికి కాదు కదా? అంటూ సీరియస్‌ అయిన బాబు దెబ్బకు తెలుగు తమ్ముళ్లు దడదడలాడిపోయారు. అప్పటికప్పుడు జనసమీకరణ విషయంలో నిమగ్నమయ్యారు.

తన బహిరంగ సభకు హాజరీ తక్కువగా ఉండటంపై చంద్రబాబు ఎంతగా హర్ట్ అయ్యారంటే.. బాబు ప్రసంగిస్తారని చెప్పేందుకు మంత్రి సుజాత మైక్ అందుకొని.. ‘‘రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు’’ అని చెబుతున్న వేళ ఆమె మాటల్ని అడ్డుకొని.. ‘అవసరంలేదమ్మా. ఆపు. ఇక్కడ ముగ్గురు పిల్లలు మాట్లాడటానికి సిద్ధంగాఉన్నారు. వారితో మాట్లాడించు. నువ్వు ఇక ఆపమ్మా’’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేయటంతో మంత్రి సుజాత చిన్నబుచ్చుకున్న పరిస్థితి. బాబు లాంటి నేత బహిరంగ సభకు వస్తున్న వేళ.. అలెర్ట్ గా ఉండాల్సిన తమ్ముళ్లు ఏమైనట్లు? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు? అన్నది టీడీపీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.