Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు బాబు సరికొత్త షాకిచ్చారా?

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:01 AM GMT
కేసీఆర్ కు బాబు సరికొత్త షాకిచ్చారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంచుమించు ఒకే తీరుతో ఆలోచిస్తారన్న విషయం గతంలో పలుమార్లు స్పష్టమైంది. పేర్లలోనే కాదు.. వ్యవహారశైలిలోనూ ఇద్దరిలో చాలానే పోలికలు కనిపిస్తుంటాయి. అధికారంలో లేనప్పుడు క్యాడర్ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ప్రదర్శించిన ఈ ఇద్దరు చంద్రుళ్లు.. తాము అధికారంలోకి వచ్చిన 19 నెలల వరకూ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో దృష్టి సారించకపోవటం గమనార్హం.

రకరకాల సాకులు చూపించారే కానీ.. పోస్టుల భర్తీ విషయంలో మాత్రం లైట్ తీసుకోవటం.. ఆశగా ఎదురుచూస్తున్న అనుచర వర్గానికి నామినేటెడ్ పోస్టుల్ని పప్పు బెల్లాలుగా పంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారం చేతికి రానప్పుడు మాత్రం.. తాము అధికారంలోకి వస్తే.. ఎవరికి ఏం చేస్తామన్న విషయంపై హామీల మీద హామీలు కురిపించే చంద్రళ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కామ్ గా ఉన్నారో అర్థం కాని పరిస్థితి.

ఒక్క అనుచర వర్గానికి మాత్రమే కాదు.. తమకు సన్నిహితంగా ఉండే వర్గాలు వేటికి వారు భారీగా సాయం చేసింది లేదన్న చేదు నిజం కనిపిస్తుంది. నామినేటెడ్ పోస్టుల విషయం ఇప్పటివరకూ ఊరిస్తున్న చంద్రబాబు.. ఎట్టకేలకు తన మాటను నిలబెట్టుకుంటూ.. కొద్ది మందికి పదవుల్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో బాబు ఒక స్టెప్ తీసుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నా.. తమ ముఖ్యమంత్రి మాత్రం కామ్ గా ఉన్నారని.. ఇప్పటికే ఐదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం ముగిసిపోయిందని.. ఇంకా ఇవ్వకుండా ఎందుకు పెండింగ్ పెడతారంటూ మండిపడుతున్నారు.

తాజాగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగినట్లుగా చెబుతున్నారు. తమదైన నిర్ణయాలు తీసుకుంటూ ఒకరికి ఒకరు షాకులిచ్చుకునే చంద్రుళ్లు ఇద్దరూ.. తాజాగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒక అడుగు ముందుకేసి ఏపీ ముఖ్యమంత్రి బాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో నామినేటెడ్ పదవులు పంపిణీ విషయంలో కేసీఆర్ కసరత్తు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.