Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై ఇవేం గొప్ప‌లు చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   10 July 2018 5:26 AM GMT
అమ‌రావ‌తిపై ఇవేం గొప్ప‌లు చంద్ర‌బాబు?
X
న‌గ‌రం అంటే.. జీవ‌నం ఉండాలి. అలా కాకుండా పేప‌ర్ల మీద 70వేల ఎక‌రాల్ని చూపించేసి.. ఇక్క‌డ బ‌డి.. అక్క‌డ గుడి.. ఇక్క‌డ అసెంబ్లీ.. ఇక్క‌డేమో ఇళ్లు.. అక్కడేమో క్రీడాస్థ‌లం అంటూ గ్రాఫిక్కులు చూపిస్తే స‌రిపోదు. పేప‌ర్ల మీద ఉన్న‌ది ఉన్న‌ట్లుగా వాస్త‌వంలో చూపిస్తే అందం చందం. అలాంటిదేమీ లేకుండానే నాలుగేళ్లు గ‌డిపేసి.. ఇప్ప‌టికి ఎలాంటి నిర్మాణాలు స్టార్ట్ కాని అమ‌రావ‌తి మీద ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్న మాట‌లు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

అమ‌రావ‌తిని హ‌రిత న‌గ‌రంగా నిర్మిస్తున్నామ‌ని.. ప‌చ్చ‌టి ఉద్యాన‌వ‌నాలు.. సుంద‌ర‌మైన కాలువ‌ల‌తో అమ‌రావ‌తి ఉంటుంద‌ని.. వంద‌శాతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్నే ఉప‌యోగిస్తామ‌ని.. అత్య‌వ‌స‌ర సేవ‌లు ఐదు నిమిషాల్లో.. సామాజిక అవ‌స‌రాలు ప‌ది నిమిషాల్లో.. ఆఫీసుల్లో ప‌దిహేను నిమిషాల్లో కాలి న‌డ‌క‌న చేరుకుంటామంటూ చంద్ర‌బాబు చెబుతున్న మాట‌లు విన్న‌ప్పుడు.. రియ‌ల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సేల్స్ ప‌ర్స‌న్స్ త‌మ ఫ్లాట్లు అమ్ముకోవ‌టానికి చెప్పే మాట‌ల్లా అనిపించ‌క మాన‌దు.

రియ‌ల్ సంస్థ‌ల ప్ర‌తినిధులు.. క‌ళ్ల ముందే త్రీడీ సినిమాను చూపించ‌టం మామూలే. ఇప్పుడు అదే రీతిలో బాబు సింగ‌పూర్లో అమ‌రావ‌తి సినిమాను చూపించార‌ని చెప్పాలి. అమ‌రావ‌తికి రండి..ఆయుష్షు పెంచుకోండంటూ ఆయ‌న నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు బాగానే ఉన్నా.. అమ‌రావ‌తిలో ఏమున్న‌ద‌ని ఈ మాట‌లు చెప్ప‌టానికి అన్న ప్ర‌శ్న రాక మాన‌దు.

కొన్ని క‌ట్ట‌డాలైనా క‌ట్టిన త‌ర్వాత ఈ త‌ర‌హా మాట‌లు చెబితే బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా ఉత్త మాట‌ల‌తో హ‌డావుడి చేయ‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. పెట్టుబ‌డి లేని స‌హ‌జ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని.. ఆరోగ్య‌క‌ర‌మైన పంట‌ల్ని ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు చెప్పారు.

ఎవ‌రైనా అమ‌రావ‌తి వ‌చ్చి స్థిర‌ప‌డొచ్చ‌న్న ఆయ‌న‌.. అక్క‌డుంటే మీ ఆయుష్షు పెరుగుతుందంటూ చెప్పిన మాట‌ల‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో ప‌దేళ్ల‌కు సైతం ఒక రూపు రాని అమ‌రావ‌తి గురించి ఇన్ని మాట‌లు చెప్ప‌టం స‌రైన ప‌ద్ధ‌తేనా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు ప‌లువురి నోట వినిపిస్తోంది.

అమ‌రావ‌తి మీద ఇన్నేసి మాట‌లు చెబుతున్న చంద్ర‌బాబు.. రేపొద్దున సింగ‌పూర్ ప్ర‌తినిధులు వ‌చ్చి చూస్తే ఏమ‌నుకుంటార‌న్న ప్ర‌శ్న పలువురి మ‌దిలో మెదులుతోంది. ప్ర‌య‌త్నం మొద‌లు కూడా కాక‌ముందే.. ఇంత.. అంత అంటూ బ‌డాయి మాట‌లు విస్మ‌యానికి గురి చేసేలా మారాయి. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి సంప‌న్నుల రియ‌ల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్న వేళ‌.. సింగ‌పూర్ కు వెళ్లి మ‌రీ చంద్ర‌బాబు చెబుతున్న మాట‌లు వింటే ఇప్పుడు సాగుతున్న ప్ర‌చారం నిజ‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌క‌మాన‌దు.