Begin typing your search above and press return to search.

చంద్రబాబు సుజనాను సైడ్ లైన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   2 March 2018 6:30 AM GMT
చంద్రబాబు సుజనాను సైడ్ లైన్ చేస్తున్నారా?
X
తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో కీలక మంత్రి పదవి హోదాను అనుభవిస్తున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రానికి సుజనా చౌదరి చేస్తున్న మేలు ఎంత? అనే విషయంలో ప్రజల్లో ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి. ఆయన తొలినుంచి కేంద్రానికి కొమ్ముకాస్తూ వారు ఎలా ఆడమంటే అలా ఆడుతూ.. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారకులు అయ్యారనే ఆరోపణలు కూడా పలువురిలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు సుజనా చౌదరిని సైడ్ లైన్ చేస్తున్నారా? అనే పుకార్లు కూడా తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయం జరిగేలా చూడడానికి ఏపీకి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోమారు పూనిక వహించారు. గతంలో పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే పలుమార్లు తెలుగుదేశం మంత్రులు, జైట్లీ లాంటి వారిని తన ఛాంబర్ కు పిలిపించుకుని మాట్లాడిన వెంకయ్యనాయుడు... తాజాగా.. మరోమారుపూనుకుని.. తన సమక్షంలోనే ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు.

అమిత్ షాతో.. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇద్దరూ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

అయితే ఇరు పార్టీల మధ్య సంబంధాలు ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్న ఈ తరుణంలో.. భాజపా జాతీయ అధ్యక్షుడితో జరుగుతున్న కీలకమైన భేటీకి సుజనా వంటి సీనియర్ ను కాకుండా ఎంపీ రామ్మోహన్ నాయుడును పంపడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా సుజనాను సైడ్ లైన్ చేస్తున్నారా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సుజనా చౌదరి గతంలో కేంద్రం ప్రకటించే ప్యాకేజీ లాంటి విషయాల్లో తనను మిస్ గైడ్ చేశాడని.. హోదా కంటే ప్యాకేజీ మంచిదని సుజనా మాటలను నమ్మడం వల్లే. తాను రెచ్చిపోయి ప్రకటనలు చేసి సూపులో పడ్డానని చంద్రబాబునాయుడు తలపోస్తున్నట్లు సమాచారం. పైగా సుజనా చౌదరి ప్రత్యేకహోదా అనేది ముగసిపోయిన అద్యాయం అని.. అది పనికిరాని హోదా అని ఇలా రకరకాల నెగటివ్ కామెంట్లు అప్పట్లో చేశారని.. అవే ఇప్పుడు పార్టీకి శాపంగా మారాయనే అభిప్రాయం కూడా చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకునే... సుజనాను సైడ్ లైన్ చేసి - చర్చలకు ఎంపీ రామ్మోహన్ నాయుడును పంపినట్లుగా తెలుస్తోంది. సుజనా నుంచి తనకు కరెక్టు ఫీడ్ బ్యాక్ రావడం లేదనే అసంతృప్తి కూడా చంద్రబాబుకు ఉన్నట్లుగా సమాచారం. ఇందులో భవిష్య రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు.