Begin typing your search above and press return to search.

సుజనాను సైడ్ లైన్ చేసేశారా?

By:  Tupaki Desk   |   7 April 2018 2:13 PM GMT
సుజనాను సైడ్ లైన్ చేసేశారా?
X
తెలుగుదేశం పార్టీలోనే మోడీ సర్కారు కోవర్టు అనే పుకారు ఆరోపణలను పుష్కలంగా ఎదుర్కొంటూ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని చంద్రబాబునాయుడు నెమ్మదిగా సైడ్ లైన్ చేస్తున్నారా? ఆయన ప్రమేయం - జోక్యం - అవసరం ఎంతమాత్రమూ లేకుండానే.. తమ పార్టీ తరఫున ఢిల్లీ పోరాట ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారా? అనే మీమాంస ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే జరుగుతోంది.

ఎందుకంటే.. ఢిల్లీ వేదికగా తెదేపా సాగిస్తూ వచ్చిన పోరాటం ప్రహసనానికి శుక్రవారం నాడే తెరపడిపోయింది. పార్లమెంటు ముగిసిన తర్వాత.. కాసేపు స్పీకరు చాంబర్ లో హడావుడి చేసిన పార్టీ ఎంపీలు.. మార్షల్స్ బయటకు గెంటసిన తర్వాత.. గేటు వద్ద కొంతసేపుండి ఇళ్లకు వెళ్లిపోయారు.

శనివారం ఉదయం అందరితో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పిమ్మట... రాజ్యసభకు కొత్తగా మళ్లీ ఎన్నికైన ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో అల్పాహార విందుకు అందరూ భేటీ అయ్యారు. ఈ భేటీకి సుజనా చౌదరి రాలేదని పుకార్లు విన వస్తున్నాయి.

అలాగే ఒకవైపు వైకాపా దీక్షలు ముమ్మరంగా జరుగుతుండగా.. తాము ఏమీ చేయకుంటే బాగుండదని అనుకున్నారేమో.. కొందరు ఎంపీలు పార్లమెంటు వద్దకు వెళ్లి గాంధీ బొమ్మ వద్ద ప్లకార్డులు పట్టుకుని శనివారం కూడా కాసేపు నినాదాలు చేశారు. అయితే ఈ స్వల్పకాలిక మినీ నినాదాల పోరాటంలో కూడా సుజనా చౌదరి కనిపించలేదు.

శుక్రవారం నాడు ఎంపీలను పార్లమెంటునుంచి బయటకు గెంటేసిన తర్వాత.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడి హోదాలో సుజనా చౌదరి ఓ ప్రెస్ మీట్ పెట్టి.. స్పీకరు వైఖరిని ఖండించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయన ఊసు ఎక్కడా వినిపించడం లేదు. పార్టీ నేతలు కూడా ఆయన నాయకత్వం గురించి, ఆయన మార్గదర్శనం గురించి పట్టించుకోవడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు కూడా.. ఢిల్లీ పోరాటాల గురించి సుజనాతో కీలకచర్చలకు ప్రాధాన్యం ఇవ్వకుండా అందరితో సమానంగా చర్చిస్తున్నారని.. క్రమంగా సుజనా ను సైడ్ లైన్ చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాలి.