Begin typing your search above and press return to search.

కమిట్ మెంట్ చాటుకునేందుకే బస్సులో పడకా?

By:  Tupaki Desk   |   12 Jan 2016 5:23 AM GMT
కమిట్ మెంట్ చాటుకునేందుకే బస్సులో పడకా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ఎత్తిన వెంటనే విమర్శలతో విరుచుకుపడేందుకు సిద్దంగా ఒక బ్యాచ్ ఉంటుంది. ఆయన చేసే ప్రతి పనిని విమర్శనాత్మకంగా చూసే వాళ్లు తక్కువేం కాదు. నిజానికి తెలుగునేల మీద పని చేసి మాట పడిన సీఎంలలో చంద్రబాబే ముందుంటారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తాజాగా చేస్తున్న ఖర్చుల మీద విమర్శలు పెద్ద ఎత్తున వచ్చి పడుతున్నాయి.

ప్రయాణాల కోసం ప్రత్యేక విమానాల్ని వినియోగించటం.. ఆఫీసు కోసం.. ఇంటి కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అలాంటి చంద్రబాబు.. తాజా చర్య ఆసక్తికరంగా మారటంతో పాటు.. చర్చనీయాంశంగా మారింది. పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖ నగరిలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వైజాగ్ వచ్చిన బాబు.. గవర్నర్ బంగ్లా ఆవరణలో బస్సులో నిద్రపోవటం ఆసక్తికరంగా మారింది.

బాబు లాంటి హైఫై ముఖ్యమంత్రి.. నగరంలోని పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో బస చేయటమో కాదనుకుంటే.. సకల వసతులు ఉన్న గవర్నర్ బంగ్లాను విడిచి పెట్టి బస్సులో నిద్రపోవటం.. తన రోజువారీ కార్యక్రమాల్ని బస్సులోనే పూర్తి చేయటం ఆసక్తికరమైంది. బాబు చేస్తున్న పని ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా మరో ఆసక్తికర వాదన వినిపిస్తోంది.

దేశ..విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వస్తున్న సదస్సు సమయంలో బస్సులో నిద్రించటం ద్వారా.. ఏపీ కోసం ఎంతగా శ్రమిస్తారన్న సంకేతంతో పాటు.. ఆయన కమిట్ మెంట్ తాజా చర్యతో స్పష్టమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఒక మాటను గుర్తు చేస్తున్నారు. సదస్సులో ప్రసంగించిన సమయంలో.. హుధూధ్ విపత్తు ప్రస్తావనతో పాటు.. తమ ఏర్పాట్లు అంత గొప్పగా లేవని.. తమను మన్నించాలంటూ అండర్ ప్లే చేసిన చంద్రబాబు.. అందుకు తగ్గట్లే తాను విలాసాల కంటే.. సింఫుల్ గా ఉండటానికే ఇష్టపడతానన్న సంకేతాల్ని పంపేందుకే బస్సులో నిద్రిస్తున్నారని చెబుతున్నారు. మరి.. బాబు బస్సు నిద్ర రాజకీయంగా ఎంతమేర లబ్థి చేకూరుస్తోందో చూడాలి.