Begin typing your search above and press return to search.

ఇదెంత నిజమో చూడాలి మరి

By:  Tupaki Desk   |   21 July 2016 7:10 AM GMT
ఇదెంత నిజమో చూడాలి మరి
X
అనుకున్నదే నిజమైంది. ఇప్పటివరకూ అంచనాలుగా.. ఊహాగానాలుగా సాగుతున్న తమ్ముళ్ల చర్చలకు పుల్ స్టాప్ పెట్టేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందన్న విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేసేశారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై చర్చ జరిపిన సందర్భంగా ఆసక్తికర అంశాలతో పాటు.. పలువురి భయాందోళనలకు చెక్ చెప్పేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రుల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉందని.. ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ మంత్రివర్గంలో స్థానం లభించే వీలుందని.. అందుకు సంబంధించిన నిర్ణయం త్వరలో ఉంటుందన్న విషయాన్ని చెప్పిన ఆయన.. ఊరించే పదవుల గురించి చెప్పేశారు. ప్రస్తుతం ఇరవై మంది మంత్రులు ఉన్నారని.. మరో ఇద్దరికి లేదంటే ముగ్గురికి అవకాశం ఉంటుందని చెప్పిన ఆయన.. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పేశారు.

అంతేకాదు.. ఇటీవల జరిపిన సర్వే అంశాల్ని ప్రస్తావించి.. ప్రభుత్వానికి చక్కటి మార్కులు వస్తుంటే.. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరి ఎన్నికల సమయంలో సర్వేలు చేయటం.. ప్రజాదరణలో వెనుకబడిన వారిని వదిలేసి కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని ఈసారి అనుసరించనన్న మాటను చెప్పిన చంద్రబాబు.. వెనుకబడిన వారిని సైతం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని.. వారిని కూడా సంస్కరించాలన్న అవసరం ఉందన్న మాటల్ని చెప్పటం గమనార్హం.

సర్వే నివేదికల్లో వచ్చే ర్యాంకులతో తమకు ఇబ్బందులు తప్పవని కంగారు పడుతున్న నేతలకు ఊరడింపు కలిగేలా చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే.. ఆయన వ్యాఖ్యలు వ్యూహాత్మకమని చెబుతున్నారు. పార్టీ నేతలు ఇన్ సెక్యూరిటీగా ఫీల్ కాకూడదన్న ఉద్దేశంతో బాబు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు. సరిగా పని చేయని వారిని.. పని తీరు బాగోలేదంటూ వస్తున్న వారిని సంస్కరించే కార్యక్రమాన్ని చేపడతానని చెప్పిన నేపథ్యంలో.. మంత్రివర్గంలో కొత్త వారి చేరికలు మాత్రమే ఉంటాయే తప్పించి.. పాత వారిని తీసేసే కార్యక్రమం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇదెంత నిజమో చూడాలి మరి.