Begin typing your search above and press return to search.

ఇలాంటి మాట‌లు బాబు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌రు

By:  Tupaki Desk   |   20 Nov 2016 5:38 AM GMT
ఇలాంటి మాట‌లు బాబు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌రు
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త‌న ప్ర‌సంగం పంథాను మార్చుకుంటున్నార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఒకే పాయింట్‌ ను ప‌దే ప‌దే చెప్పే నాయ‌కుడిగా పేరున్న చంద్ర‌బాబు ఈ క్ర‌మంలో రొటీన్‌ కు భిన్నంగా విభిన్న‌మైన అంశాల‌ను ప్ర‌స్తావిస్తున్న‌ట్లుగా చెప్తున్నారు. సామాజిక అంశాల‌పై రాజ‌కీయ వేత్త‌గా స్పందిస్తూనే వాటి నేపథ్యాన్ని ప్ర‌స్తావిస్తూ త‌త్వ‌వేత్త‌ను మ‌రిపిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్ర‌బాబు ప్ర‌సంగించిన తీరును ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రిస్తున్నారు.

--మారుతున్న కాలానికనుగుణంగా ప్రతిఒక్కరు మారాల్సిన అవసరముందని చంద్ర‌బాబు విశ్లేషించారు. భారత దేశం సంప్రదాయ సమాజం.అమెరికాలో విపరీతంగా సంపదుంది. అయితే వారికి కుటుంబాల్లేవు. ఆడామగా తేడా లేకుండా రెండుమూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వీలునుబట్టి కలిసుంటున్నారు. లేదా ఎవరికి వారు విడిపోతున్నారు. వృద్దాప్యంలో ఏకాంతంగా మిగులుతున్నారు. అలాంటి సంప్రదాయాలు మనకొద్దు.. జపాన్‌ లో వృద్దులు అధికంగా ఉన్నారు. చైనా జనాభా తగ్గి వృద్దులే ఎక్కువ సంఖ్యలో మిగులుతున్నారు. యూరోప్‌ లోనూ అదే పరిస్థితి. ఇక మన రాష్ట్ర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్నిఅధికంగా కనాల్సిన అవసరముందని చంద్ర‌బాబు వివరించారు. ఈ రాష్ట్రానికి యువతే అతిపెద్ద సంపద. వారి మేథస్సే రాష్ట్రాభివృద్దికి గొప్ప వరం. ప్రపంచంలోని అగ్రదేశాల్లో కూడా తెలుగు యువకులు కీలక పదవుల్లో ఉన్నారు. తమ మేథస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో విద్యావంతుల సంఖ్య అధికంగా ఉంది. విద్యాధికులు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు.. పెళ్ళైన ఉద్యోగస్తులు పిల్లల్ని కనడంలేదని ఇది సరికాదని చంద్ర‌బాబు పేర్కొన్నారు. పలు దేశాల్లో వృద్దాప్యంలో పిల్లల్లేక ఆదరించే పరిస్థితి కొరవడి ఆఖరకు రోబోల‌తో సేవలు చేయించుకుంటు న్నారంటూ చెప్పారు. ఈ సంస్కృతి మనకు వ‌ద్ద‌ని అన్నారు. ఎక్కువగా పిల్లల్ని కనాలంటూ చంద్ర‌బాబు ప‌దే పదే చెప్పుకొచ్చారు.

--- తనకు కులాల్ని అంటగట్టొద్దంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తన కులం పేదరికంగా స్పష్టం చేశారు. పేదలే దేవుళ్ళు అన్న ఆశయంతో ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీకి తాను ప్రాతినిద్యం వహిస్తున్నానన్నారు. సమాజమే తనకు దేవాలయంగా చెప్పారు. తనకన్ని కులాలు సమానమేనన్నారు. అన్నికులాల్లోని పేదల జీవన ప్రమాణాల పెంపే తన లక్ష్యంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో పలు మాద్యమాల ద్వారా తనపై కుల ముద్రవేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

-- పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను మోసిన సీనియర్ కార్యకర్తలకు - పాపులారిటీ కలిగినవారికే నామినేటెడ్ పదవులు ఇస్తానని చంద్ర‌బాబు పేర్కొన్నారు. అయితే పదవులకు సీనియారిటీ ఒకటే సరిపోదని - పాపులారిటీ కూడా అవసరమని - అటువంటి వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం మాదిరిగా అభివృద్ధి చెందాలన్నారు. 54లక్షల మంది సభ్యత్వం ద్వారా సమకూరిన నగదును సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని బాబు అన్నారు. కార్యకర్తల గౌరవ - ప్రతిష్ఠలు పెంచే పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటేనన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద ఆస్తి అన్నారు. కష్టనష్టాలకు ఓర్చి జెండా మోస్తున్న కార్యకర్తలే శ్రీరామరక్ష అన్నారు. కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నామన్నారు. మంచిచేస్తే ప్రజలెపుడూ మన వెంటే ఉంటారని గుర్తించాలన్నారు. ఎన్నికల మేనిఫేస్టోను కచ్చితంగా అమలుచేస్తున్నామన్నారు.

--ఆధునిక టెక్నాలజీ వల్ల 95 శాతం శాంతి భద్రతలను అదుపుచేయగలుగుతున్నామన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పనిచేస్తున్నానన్నారు. సమాజంపై కమిట్‌ మెంట్‌ తో టిడిపి నవ సూత్రాలు అమలు చేస్తుందన్నారు. ఆరు కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు వున్నాయని వీటిని ఎన్‌ పిసిఎ కు అనుసంధానం చేస్తామన్నారు. ఇంకా 9 లక్షల మంది జన్‌ ధన్ అకౌంట్లు తీసుకోవాల్సి వుందన్నారు. త్వరలో బ్రాందీ షాపుల్లో కూడా స్వైప్ విధానం వినియోగంలోకి రానుందని ప్రకటించడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/