Begin typing your search above and press return to search.

చంద్రబాబు నోట కట్నం మాట

By:  Tupaki Desk   |   8 March 2016 7:34 AM GMT
చంద్రబాబు నోట కట్నం మాట
X
మహిళలకు ఎదురు కట్నం ఇచ్చే రోజులు త్వరలో రాబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంఖ్య తగ్గుతోందని అన్నారు. అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. మహిళలు - చిన్నారులపై అత్యాచారాలను నిరోధించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

టీడీపీ హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించింది టీడీపీయేనని.... రాష్ట్రంలో 49.8 శాతం మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని, రాష్ట్రంలో భూములు - ఇళ్లు మహిళల పేరు మీదనే ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 వేల కోట్ల రుణాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు చెప్పారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గర్భిణులు - బాలింతలకు పౌష్టికాహారం - గర్భిణులకు 102 కాల్‌ సెంటర్‌ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటుచేస్తామన్నారు. మహిళలకు ఆస్తి హక్కు చట్టం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తామని చెప్పారు.

కాగా కట్నం ఏ రూపంలో ఉన్నా అది దురాచారమే. వరకట్నం దురాచారం ఇప్పుడు భారీ స్థాయిలో ఉంది. వరకట్నం అయినా, మహిళలకు ఎదురు కట్నమైనా ఏదైనా కూడా అలాంటివాటికి వ్యతిరేకించాల్సిన పాలకులు అందుకు భిన్నంగా మాట్లాడడం తగదన్న భావన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఎదురు కట్నాలు వస్తాయని చంద్రబాబు అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.