Begin typing your search above and press return to search.

బాబుగారి ఫ్లైట్ జ‌ర్నీల‌కే రూ.100 కోట్లు ఖ‌ర్చు!

By:  Tupaki Desk   |   3 May 2019 6:33 AM GMT
బాబుగారి ఫ్లైట్ జ‌ర్నీల‌కే రూ.100 కోట్లు ఖ‌ర్చు!
X
బాబు నోరు తెరిస్తే చాలు.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ఆర్థిక దుస్థితి గురించి అదే ప‌నిగా చెబుతుంటారు. మ‌రింత ఆర్థిక గ‌డ్డు ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వాధినేత‌గా ఉన్న చంద్ర‌బాబు ఎలా ఉండాలి? ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి? ఆచితూచి అన్న‌ట్లు ప్ర‌తి రూపాయిని పొదుపు చేయాల్సిన పెద్ద‌మ‌నిషి.. ఎంత విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేశార‌న్న దానికి నిద‌ర్శ‌నంగా ఆయ‌న ఫ్లైట్ జ‌ర్నీల ఖ‌ర్చును చెప్పాల్సిందే.

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు చేసిన విమాన‌ప్ర‌యాణాల కోసం ఏపీ ఖ‌జానా మీద ప‌డిన భారం ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.100కోట్లు. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఎక్క‌డ‌కు వెళ్లినా ప్ర‌త్యేక విమానాల్ని వాడేసే ముఖ్య‌మంత్రి కార‌ణంగా ఖ‌జానా మీద భారీగా భారం ప‌డిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.

విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు సైతం ప్ర‌త్యేక విమానాల్ని వాడేసిన సీఎంగా చంద్ర‌బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో త‌న మొద‌టి విదేశీ ప‌ర్య‌ట‌న‌ను సింగ‌పూర్ తో స్టార్ట్ చేశారు. ఈ ప‌ర్య‌ట‌న కోసం ప్ర‌త్యేక విమానాన్ని తీసుకెళ్ల‌టంతో ప‌లువురిని అవాక్కు అయ్యేలా చేసింది.

అధికార పర్య‌ట‌న‌ల‌తో పాటు.. పార్టీ ప‌ర్య‌ట‌న‌ల కోసం ప్ర‌త్యేక విమానాల్ని వినియోగించే బాబు కార‌ణంగా.. ఖ‌ర్చు త‌డిచి మోపుడ‌య్యే ప‌రిస్థితి. తాజాగా నాలుగు నెల‌ల ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ లో రూ.10కోట్ల మొత్తాన్ని తాజాగా విమాన ఖ‌ర్చుల కోసం నిధులు విడుద‌ల చేశారు. రెవెన్యూ లోటు భారీగా ఉన్న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు ఇంత ల‌గ్జ‌రీగా ఖ‌ర్చులు చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. బాబు ఖ‌ర్చుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా.. ఆయ‌నలో మాత్రం మార్పు వ‌చ్చింది లేదు.

కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్పించి.. మిగిలిన సంద‌ర్భాల్లో రెగ్యుల‌ర్ విమానాల్ని ఉప‌యోగించుకునే వీలున్నా.. బాబు మాత్రం ప్ర‌త్యేక విమానం త‌ప్పించి.. మామూలు వాటిల్లోఎక్క‌ని ప‌రిస్థితి. దీంతో.. గ‌న్న‌వ‌రంలో ప్ర‌త్యేకంగా ఒక హెలికాఫ్ట‌ర్ ను... ఒక విమానాన్ని ప్ర‌త్యేకంగా సిద్ధం చేసి ఉంచ‌టం చేస్తున్నారు. దీంతో.. ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసిన వాటికి అద్దె మొద‌లు అన్ని ఖ‌ర్చులు భారీగా ఖ‌జానా మీద ప‌డే ప‌రిస్థితి. బాబు కార‌ణంగా ఏపీకి జ‌రిగిన లాభం ఎంత‌న్న‌ది చెప్ప‌లేం కానీ.. ఖ‌ర్చు మాత్రం భారీగా అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.