Begin typing your search above and press return to search.

ప్ర‌చారానికే 300 కోట్లు ప‌క్క‌న‌పెట్టిన బాబు!

By:  Tupaki Desk   |   30 Nov 2018 8:42 AM GMT
ప్ర‌చారానికే 300 కోట్లు ప‌క్క‌న‌పెట్టిన బాబు!
X
తెలంగాణలో ఇప్పుడు టీవీల్లో - దిన ప‌త్రిక‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల జోరు న‌డుస్తోంది. పార్టీలు హామీలు గుప్పిస్తూ - త‌మ మేనిఫెస్టోను ప్ర‌జ‌ల ముందుకు తెస్తూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్(మ‌హా కూట‌మి) మునుపెన్న‌డూ లేనంత స్థాయిలో టీవీల్లో - ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోంది. అధికార టీఆర్ ఎస్ సైతం ఈ విష‌యంలో వారితో పోటీ ప‌డ‌లేక‌పోతోందంటే అతిశ‌యోక్తి కాదు!

వాస్త‌వానికి టీఆర్ ఎస్‌ - వైఎస్సార్‌ సీపీల‌కు సొంతంగా టీవీ ఛానెళ్లు - ప‌త్రిక‌లు ఉన్నాయి. కాబ‌ట్టి ఆ పార్టీలు వాటిలో విస్తృతంగా ప్ర‌చారం చేసుకుంటాయి. ఇక టీడీపీకి సొంతంగా మీడియా సంస్థ‌లు లేవ‌న్న‌మాటేగానీ.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు బ‌ల‌మైన మీడియా సంస్థ‌ల మ‌ద్ద‌తు ఆ పార్టీకే. అందుకే వాటిని ఎల్లో మీడియాగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. కాంగ్రెస్‌కు మాత్రం ఇక్క‌డ మీడియాలో పెద్ద‌గా ఆద‌ర‌ణ లేద‌న్న‌దే విశ్లేష‌కుల అభిప్రాయం.

అయితే - ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌చార జోరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్ ఎస్ ఊహ‌కైనా అంద‌నంత స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోంది. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌కు కాంగ్రెస్ హైక‌మాండ్ డ‌బ్బులేమీ ఇవ్వ‌డం లేద‌న్న‌ది విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రి భారీ ఖ‌ర్చును భ‌రిస్తూ ఇంత‌గా ఎలా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌న్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌న‌సుల్లోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌.

ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడేన‌ట‌. తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ ను ఓడించి - కేసీఆర్‌ ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు వ్యూహం ర‌చించార‌ట‌. ఇందులో భాగంగా మీడియా మేనేజ్‌ మెంట్ కోస‌మే ఆయ‌న రూ.300 కోట్ల‌ను ప‌క్క‌న‌పెట్టుకున్నార‌ట‌. ప్ర‌జా కూట‌మికి అనుకూలంగా తెలంగాణ వ్యాప్తంగా మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు గుప్పించే బాధ్య‌త‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కే చెందిన టీడీ జ‌నార్థ‌న్‌ కు బాబు అప్ప‌గించార‌ట‌. అందుకే మీడియాలో ఎక్క‌డ‌, ఎప్పుడు చూసినా ప్ర‌జా కూట‌మి ప్ర‌క‌ట‌న‌లే క‌నిపిస్తున్నాయ‌ట‌. మ‌రి బాబు వ్యూహం ఫ‌లిస్తుందో లేదో తెలియాలంటే మ‌రో 11 రోజులు ఆగాల్సిందే!