Begin typing your search above and press return to search.

జర్నలిస్ట్‌ ల కలల్ని చెరిపేసిన ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   6 March 2019 3:30 AM GMT
జర్నలిస్ట్‌ ల కలల్ని చెరిపేసిన ఏపీ ప్రభుత్వం
X
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్కరోజు కూడా జర్నలిస్ట్‌ ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే జర్నలిస్ట్‌ లకు స్థలాలు వచ్చాయంటే అది కాంగ్రెస్‌ పుణ్యమే. కానీ ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబుకి ఎందుకో జర్నలిస్ట్‌ లపై ప్రేమ కలిగింది. అంతే.. కో ఆపరేటివ్‌ సోసైటీ ఏర్పాటు అయ్యింది. దానికి అమరావతి ప్రాంతంలో 30 ఎకరాలు కేటాయిస్తూ జీఓ కూడా వచ్చేసింది.

జీవో రావడంతో జర్నలిస్ట్‌ లు సంబరాలు చేసుకున్నారు. కల నిజమవుతోంది సంబరపడ్డారు. అయితే..ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. కొంతమంది జర్నలిస్ట్‌ లు వెళ్లి చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు. స్థలం అయితే ఇచ్చారు కానీ ఇల్లు కట్టుకునే స్తోమత లేదని..కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలని అడిగారు. దీంతో..చంద్రబాబు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. జర్నలిస్ట్‌లకు ఇచ్చిన 30 ఎకరాల జీఓని క్యాన్సిల్‌ చేసి. . 15 ఎకరాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే. ఈ 15 ఎకరాల్లో జర్నలిస్ట్‌లకు సీఆర్‌ డీఏనే ఇల్లు కట్టింస్తుందని ఇవాళ కేబినెట్‌ లో తీర్మానం చేశారు.

అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. 30 ఎకరాలు ఇచ్చినప్పుడు జర్నలిస్ట్‌ లు దాని ధర మాత్రమే చెల్లించారు. అప్పుడు మహా అయితే ఒక జర్నలిస్ట్‌ కు రూ.లక్ష రూపాయలు పడుతుంది. స్థలం కొన్న తర్వాత ఆ 30 ఎకరాలు డెవలెప్‌ మెంట్‌ కు ఇస్తే.. 15 ఎకరాల్లో నిర్మాణం పూర్తై.. అందరికి ఇళ్లు వచ్చేవి. కానీ వెల్ఫేర్‌ కోటాలో ఇచ్చే స్థలాన్ని డెవలెప్‌ మెంట్‌ పేరుతో వ్యాపారం చేయకూడదు. దీంతో.. సీఆర్‌ డీఏనే కట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే.. ఇప్పుడు 30 బదులు 15 ఎకరాలే ఇస్తుంది. ఇందులో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తుంది. ఇందుకుగాను కొంత ఎమౌంట్‌ కట్టాలి. అన్ని బెనిఫిట్స్‌ పోనూ.. 900 చదరపు గజాల ఫ్లాట్‌కు రూ.9 లక్షలు కట్టాలి. అలాగే 1200 చదరపు అడుగులకు రూ.13.20 లక్షలు - 1500 చదరపు అడుగులకు రూ.19.50 లక్షలు - 1800 చదరపు అడుగులకు రూ.27 లక్షలు కట్టాలి. అంత డబ్బు కట్టే స్థోమతే ఉంటే.. బయటే కొనుక్కుంటాం కదా.. ఇవన్నీ ఎందుకు అని జర్నలిస్ట్‌ లు ఆవేదన పడుతున్నారు. మొత్తానికి జర్నలిస్ట్‌ ల సొంత ఇంటి కలలకు పెద్ద దెబ్బే వేశారు బాబు గారు.