Begin typing your search above and press return to search.

'దేశం' లో 50 మంది ఔట్...

By:  Tupaki Desk   |   23 Aug 2018 1:30 AM GMT
దేశం లో 50 మంది ఔట్...
X
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వడపోత ప్రారంభమయ్యింది. వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మేల్యేలలో కనీసం 50 మందికి ఈ సారి టిక్కేట్టు దక్కే అవకాశం కనబడటం లేదు. వివిధ సర్వేలు - విశ్లేషణలు నిర్ధారణల అనంతరం ఈ వడపోత కార్యక్రమానికి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - నారా చంద్రబాబు నాయుడు అభ్యర్దుల జాబితాను రూపొందిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికలలో అధికారమే పరామావధిగా భావిస్తున్న చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్లను కాదని కొత్తవారికి టిక్కేట్లు ఇచ్చి విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సర్వేలను అడ్డం పెట్టుకుంటున్నట్లు సమాచారం.

రానున్న ఎన్నికలలో విజయం సాధిచడం దాదాపు అసాధ్యంగా మారిన విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు కొత్త అభ్యర్దులతో ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు. ఇందుకోసం పార్టీలో సీనియర్లను సైతం పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో పార్టీలో ఎటువంటి తిరుగుబాటు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్నారనే సాకుతో కొంత మంది సీనియర్లకు ఉద్వాసన పలికే పనిలో పడ్డారు చంద్రబాబు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ చర్య తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అవకాశలు లేవు. పార్టీలో ఎన్నాళ్లనుంచో ఉన్న సీనియర్లను కాదని అవినీతి ఆరోపణల పేరుతో టిక్కేట్లు నిరకారిస్తే తిరుగుబాటు తప్పదని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుతో తమకు అవమానం జరుగుతోందని ఆ సీనియర్లు వాపోతున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడుకు ముందు నుయ్యి - వెనుక గొయ్యి లాగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేత జగన్ మోహన రెడ్డికి నానాటికి సానుభూతి పెరుగుతూండడంతో చంద్రబాబులో గుబులు పెరిగింది. దీంతో ఆయన అభ్యర్ధులను మార్చాలనే పనిలో పడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకుల వద్ద కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. టిక్కట్ల పంపిణీలో తనదైన మార్కు ఉండాలని, సీనియర్లలో కొందరు స్వంతంత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆందోళన చంద్రబాబులో నానాటికి పెరుగుతోందంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు ఆయన కొత్త వారికి టిక్కట్లు ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం. మొత్తానికి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం సార్టీలో కలకలం రేగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.